20 new KGBV schools for Telangana: తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఉంటే అందులో 696 అంటే సుమారుగా 15 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు, మైనారిటీలకు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆడ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(KGBV)ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Read Also: Kishan Reddy: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టీఆర్ఎస్ ఆరోపణలు..
భారతదేశంలో ఉత్తర్ ప్రదేశ్ తరువాత తెలంగాణలోనే అత్యధికంగా కేజీబీవీ విద్యాలయాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. మరింత ఎక్కువమందికి పాఠశాల విద్యను అందుబాటులోకి తీసుకురావడం, బడుగు బలహీన వర్గాలు మరియు అణగారిన వర్గాల పిల్లలను ఒకే చోట చేర్చి వారి మధ్య సమానత్వ భావనను పెంపొందించడం, ప్రాథమిక విద్య నుండి 12 వ తరగతి వరకూ అన్ని స్థాయిల పాఠశాల విద్యలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమాన్ని పునః రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. కొత్తగా మరో 20 కేజీబీవీలను తెలంగాణకు కేటాయించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి. 2018 నుంచి గత నాలుగు సంవత్సరాల్లో మొత్తం 104 కేజీబీవీలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. 2022-23 ఏడాదికి దేశం మొత్తంలో 31 కేజీబీవీలు కేటాయిస్తే ఒక్క తెలంగాణకే 20 కేజీబీవీలను కేటాయించినట్లు ఆయన తెలిపారు.