KCR : తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పాలన కేవలం తనను దూషించడం, అవమానించడమే పరమావధిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడానికే విలువైన సమయాన్ని వెచ్చిస్తోందని ఆయన ఆక్షేపించారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు మెరుగైన ఫలితాలు సాధించారని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో తాము మరింత ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ సాగునీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో ప్రభుత్వం ఢిల్లీ వద్ద మోకరిల్లిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఒక కొత్త పాలసీ తేలేదని, తీసుకువచ్చిన పాలసీ అంతా భూమి రియల్ ఎస్టేట్ కు సంబంధించిందే అయినా రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది పథకం ఒకటి ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసింది.
ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు డైరెక్టుగా వచ్చేది కానీ ఈరోజు ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం అంతా లైన్లలో నిలబడే పరిస్థితి ఉందన్నారు కేసీఆర్. నీటి హక్కుల పరిరక్షణ కోసం బిఆర్ఎస్ పార్టీ మరోసారి జల ఉద్యమానికి సిద్ధమవుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో త్వరలోనే భారీ బహిరంగ సభలు లేదా సమర శంఖం పూరించేలా కార్యాచరణ ఉంటుందని నేతలకు సూచించారు. అదేవిధంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియామకాలు చేపట్టాలని, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సమరోత్సాహంతో సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.