MLA Kaushik Reddy: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పర్యటించారు. మంజరైన ఇందిరమ్మ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి హోల్డ్ లో పెట్టిన ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని గొప్పగా చెబుతుంది.. నా నియోజక వర్గంలో 40 వేల మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైతే కేవలం 15 వందల మందికి ప్రోసిడింగ్ కాపీలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిన వాళ్లు పాత ఇల్లు తొలగించి ఇల్లు కట్టుకుంటున్నారు.. 20 ఏళ్ల క్రితం ఐదు సిమెంట్ బస్తాలు రూ. 3 వేలు తీసుకున్నారని చెప్పి ప్రొసిడింగ్ కాపీలు క్యాన్సల్ చేస్తున్నారు.. అధికారులను పంపించి ముగ్గు వేయించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు ఎలా క్యాన్సల్ చేస్తారని ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన శ్రీరాములపేటలో ఇప్పటి వరకు ఎందుకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వలేదని అడిగారు. దళిత బంధు వచ్చిన దళితులకు ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఇవ్వరు.. ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు వచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని చెప్పారా సమాధానం ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Rahul Gandhi: “శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల”పై రాహుల్ గాంధీ బొమ్మ.. కాంగ్రెస్‌పై విమర్శలు..
ఇక, ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాటినీ రద్దు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. పేదల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడవద్దు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని యూరియా బస్తాల లోటు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది అన్నారు. రైతు బంధు రూ. 15 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇవ్వలేదు.. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి.. కాబట్టి రైతులకు రైతు బంధు ఇస్తున్నారని ఆరోపించారు. పంట వేసి రెండో పంట సమయం వచ్చిన ఇప్పటి వరకు రైతులకు బోనస్ ఇవ్వలేదు.. కళ్యాణ లక్ష్మీ చెక్కుతో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు అడుగుతున్నారు.. నా మీద కోపం ఉంటే నన్ను జైలుకు పంపండి పెదవాళ్ళ విషయంలో రాజకీయం చేయకండి అన్నారు. వారం, పది రోజుల్లో ప్రాసిడింగ్ కాపీ ఇచ్చిన వాళ్లకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వకపోతే లబ్దిదారుల కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తాం.. ములుగు నియోజక వర్గంలో ప్రశ్నించిన యువకుడి మరణానికి కారణమైన మంత్రి సీతక్కపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటికీ శాశ్వతం కాదు అధికారులు న్యాయంగా పని చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సూచించారు.