Jagadish Reddy : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోదావరి – కృష్ణ జలాల వినియోగానికి సంబంధించిన అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీటి వాటా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు నష్టం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి చురుగ్గా స్పందించాల్సిన అవసరం ఉన్నా, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై ఎలాంటి చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు.
Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?
ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దోచుకున్న తీరును గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు అదే పరిస్థితి గోదావరి జలాలపై పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒక్కటై గోదావరి జలాలను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ నేతలూ నిర్లక్ష్యంగా మాట్లాడకూడదని, కేంద్రంలో మంత్రి స్థాయిలో ఉన్న వారు కూడా వాస్తవ పరిణామాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు.
గోదావరి-కావేరీ లింక్ అంశాన్ని గొడవగా మార్చి, తన ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించిన జగదీష్ రెడ్డి, అపెక్స్ కమిటీ సమావేశం కోసమే ప్రయత్నించాలే తప్ప, చంద్రబాబుతో ప్రత్యక్ష సమావేశం అనే ఆలోచనే తప్పు అని అన్నారు. చంద్రబాబుతో చర్చలకు వెళ్లడం అంటే దాసోహంగా మారిపోయినట్టేనని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో గట్టిగా స్పందించాలంటూ డిమాండ్ చేశారు.
కేసీఆర్ చేసిన సూచనలతో ఇప్పటి పరిస్థితులను పోల్చుతూ, అప్పట్లో కేసీఆర్ సముద్రంలో వృథాగా పోతున్న నీటిని రెండు రాష్ట్రాలు కలిసి ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలని లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం పూర్తిగా వక్రదిశలోనిదని, ఆయన లక్ష్యం తెలంగాణ ప్రజల హక్కులను పక్కదారి పట్టించడమేనన్నారు.
రైతుల సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేస్తున్న సంబరాలపై కూడా జగదీష్ రెడ్డి కఠినంగా స్పందించారు. “రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసినందుకా సంబరాలు? రైతు భరోసా మూడు విడతలు వాయిదా వేసినందుకా సంబరాలు?” అని ప్రశ్నించారు. రైతులు అంటే కేవలం కొన్ని రాజకీయ నేతల కుటుంబాలేనా అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నమ్మి గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర ప్రయోజనాలను కాపాడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.