తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి కూడా నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also: CM KCR Yadadri Tour: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే..
మరో రెండు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు ఏపీలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది.