తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు.. ఉదయం 10.30 గంటలకు రోడ్డు మార్గంలో యాదగిరి గుట్టకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం దంపతులు.. ఉదయం 11.30 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న ఆయన.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, ఆలయ ‘విమాన గోపురం’కు బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. ఇక, తన పర్యటనలో భాగంగా క్షేత్రంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానాలయ దివ్య విమానగోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలో కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఆ దిశగా ఇప్పటికే చాలామంది ప్రముఖులు, భక్తులు.. స్వామివారికి పుత్తడిని సమమర్పించారు. అందులో భాగంగా తాను కూడా కిలో16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించారు సీఎం కేసీఆర్.. ఇవాళ ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించనున్నారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు, జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో కేసీఆర్ యాదాద్రి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది… ఇవాళ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్…. దసరాకంటే ముందే కోనాయపల్లి వేంకటేశ్వరస్వామిని సైతం దర్శించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఓవైపు రాజకీయ పార్టీ ప్రకటనపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ఇష్ట దైవాన్ని దర్శించుకుంటున్నారు సీఎం కేసీఆర్.. కాగా, అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది. కేసీఆర్ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారని… వీటిలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది..