Harish Rao: పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04/07/2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో.. ఆంధ్రప్రదేశ్ సర్కార్ బనకచర్ల ప్రాజెక్టు పేరిట గోదావరి నీళ్ల దోపిడి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? అని మండిపడ్డారు. నాడైనా, నేడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీసే ఏ కుట్రలనైనా బీఆర్ఎస్ పార్టీ సహించదు అని హరీష్ రావు వెల్లడించారు.
Read Also: MLA Kaushik Reddy: పేదల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడొద్దు..
ఇక, పదవులకు రాజీనామాలు చేయడం మాత్రమే కాదు, పేగులు తెగే దాకా కొట్లాడుతామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కాపలా ఉంటాం.. కంటికి రెప్పలా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుంటాని చెప్పుకొచ్చారు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే.. పొలిమేర దాకా తరిమికొడతాం.. ప్రాంతంవాడే ద్రోహం చేస్తే.. ప్రాణంతోనే పాతర వేస్తమని హరీష్ రావు రాసుకొచ్చారు.