హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని తరలిస్తూ తమ నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. అవసరమైతే కాలువ షెటర్లను పగులగొట్టి రైతులకు నీటిని అందిస్తానని ఆయన హెచ్చరించారు.
Game Changer : “గేమ్ ఛేంజర్” హెచ్ డీ లీక్ భాద్యులు ఎవరంటే ?
తాను పోలీసులకు వ్యతిరేకం కాదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేవరకు పోరాటం కొనసాగిస్తానని, హుజురాబాద్ ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేదిలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు రూ.1,16,000 అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోని సుఖ ప్రసవాల ప్రోత్సాహ పథకాన్ని ఉదహరిస్తూ, ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.13,000, మగపిల్ల పుట్టినప్పుడు రూ.12,000 అందించి, తల్లి బిడ్డలను అంబులెన్స్ ద్వారా ఇంటి వరకు తీసుకెళ్తారని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందే రాధిక, తహసీల్దార్ కనకయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.