Flood in Hyderabad: మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ లో సుమారు 15 హాస్టల్ లు నీట మునిగాయి. విద్యార్థులు బయటకు వచ్చేందుకు వీలులేకుండా పోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే 30 అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు కూడా చేరింది. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో ఒక్కో అంతస్తు వరకు వరద నీరు చేరింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ అపార్ట్ మెంట్లలోనే ఉంటున్నారు. అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి వరద నీరు చేరడంతో ఆయా అపార్ట్‌మెంట్లలో ఉంటున్న విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు జేసీబీలను పిలిపించి అపార్ట్‌మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. కాగా, మైసమ్మగూడలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షానికి అపార్ట్‌మెంట్‌లు ముంపునకు గురయ్యాయి. దీంతో ఈ అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులు ఉదయం నుంచి భయంతో గడుపుతున్నారు.
Read also: Asia Cup 2023: కోహ్లీ అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన బీజేపీ ఎంపీ.. అది తట్టుకోలేకపోయానంటూ..!
మేడ్చల్‌లోని మైసమ్మగూడ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు చాలా మంది ఈ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారు. ఇక్కడ నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఈ అపార్ట్‌మెంట్లలోనే ఉంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని పలు కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. చెరువుకు నీటి మార్గంలో అపార్ట్‌మెంట్లు నిర్మించడంతో నీటి మార్గం లేకుండానే అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు చేరింది. ఇలాంటి నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే సమయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Russia: పుతిన్, కిమ్ సమావేశం.. ఆయుధాల డీల్ కోసమే..