హోలీ వేడుకలతో జంటనగరాల పరిధిలో పోలీసులు 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Read Also: LIC: వాటాల విక్రయానికి కేంద్రం నిర్ణయం.. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత..!
ఇక, హోలీ పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని స్టార్ హోటళ్లు, క్లబ్‌లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మూసి ఉంటాయని కమిషనర్ తెలిపారు. మరోవైపు.. గుర్తు తెలియని వ్యక్తులు, స్థలాలు, వాహనాలపై రంగులు లేదా నీళ్లు చల్లడం, రోడ్లపై రంగులు అద్ది చికాకు కలిగించడం వంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని సీపీ భగవత్ హెచ్చరించారు.