ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు, చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇంకా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షలు పడుతున్నాయి. దీంతో, ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక, భారీ వర్షాల దృష్ట్యా.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, వాతావరణశాఖ తాజా ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Presidential Polls 2022: ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన రద్దు.. కారణం అదేనా..?
ఇక, తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది.. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.. రానున్న 3 రోజుల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.. ఆ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరుగుతుందని పేర్కొంది.. ఆ ప్రభావంతో రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని.. దాంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తుందని.. ఈ రోజు, రేపు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.