తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. మార్పులు, చేర్పులు కూడా ఆన్ లైన్ లోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మీ సేవాలో దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మండిపడ్డారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి? అని హరీష్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల కోసం ఇదివరకే ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరని అన్నారు. మరోసారి ప్రభుత్వం కుల గణనలో వివరాలు తీసుకున్నది. గ్రామ సభల పేరిట డ్రామా చేశారు. ఇప్పుడు మళ్లీ మీసేవలో దరఖాస్తులు చేసుకోవాలని అంటున్నరు. ఇదంతా పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి.. స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా? అని ప్రశ్నించారు. ప్రజా పాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగింది. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు. జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు అని హరీష్ రావు వెల్లడించారు.
పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే మీ ప్రభుత్వ దృష్టి ఉందని ఎద్దేవ చేశారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, 14 నెలల పాలనలో మీరు చేసిందేముందని అన్నారు. దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలవాలని రేవంత్ సర్కార్ కు సూచించారు.