Bhatti Vikramarka : ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన తెలిపారు, “అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే దేశం బాగుంటుంది. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాలి. రేషనలైజేషన్‌ను మేము ఆహ్వానిస్తున్నాం కానీ, రాష్ట్రాలకు జరిగే నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలి” అని స్పష్టం చేశారు.
Medak : “మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు.. కొట్టుకుపోయిన రైల్వే లైన్”
జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంపై ఎన్నో ప్రణాళికలు ఆధారపడి ఉంటాయని భట్టి గుర్తుచేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. తెలంగాణకే సుమారు 7 వేల కోట్ల రూపాయల నష్టం తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని అమలు చేసే సమయంలో కేంద్రం రాష్ట్రాలకు కనీసం 14 శాతం వృద్ధి హామీ ఇస్తామని చెప్పినా, వాస్తవానికి ఇప్పటికీ 7 శాతం మాత్రమే వృద్ధి వస్తోందని భట్టి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, సెస్ రూపంలో వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎనిమిది రాష్ట్రాలు ఏకగ్రీవంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. సెప్టెంబర్ 3న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ డిమాండ్లను లేవనెత్తాలని నిర్ణయించారు. అలాగే, అదే రోజు మళ్లీ ఆర్థిక మంత్రుల సమావేశం ఢిల్లీలో జరగనుంది.