ఆన్ లైన్ లోన్ యాప్.. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఆన్ లైన్ మోసానికి బలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్ లైన్ లోన్ యాప్ లకు దూరంగా వుండండి అంటూ పోలీసులు ఎంతగా చెబుతున్నా.. దానిని పెడచెవినపెడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారు కొందరు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆన్ లైన్ లోన్ యాప్‌కు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో నివాసముండే యంజల సుధాకర్ బహదూర్ పుర లోని చందూలాల్ బారాదరి స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనిని భార్య రెండున్నర సంవత్సరాల కూతురు ఉంది. లోన్ యాప్ నుండి అసభ్యకరమైన మెసేజ్ లు రావడంతో.. తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. ఇరవై రోజుల నుంచి ఆన్ లైన్ లోన్ కి సంబంధించిన విషయంలో మనస్థాపానికి గురవుతున్నట్లు సూచించారు. ఈ విషయం సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యలతో ఎలాంటి మనస్పర్థలు లేవని ఆవేదన వ్యక్తం చేసారు. భార్య పిల్లలతో సంతోషంగా ఉండేవాడని పేర్కొన్నారు. ఆన్‌లైన్ లోన్ బాధలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. రోజూలాగా ఉగ్యోగానికి వెళ్తున్నానని చెప్పిన సుధాకర్ ఇంటి నుంచి బయలుదేరి నిన్న ఉదయం శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై శవమయ్యాడని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగి సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడటంతో తోటి సిబ్బంది తీవ్ర విషాదంతో మునిగిపోయారు. కుటుంబానికి తగిన సాయం చేయాలని, సుధాకర్ కుటుంబానికి ఆదుకోవాలని కోరారు.