హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ మూసివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మార్కెట్‌ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అయితే.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై హైకోర్టును ఆశ్రయించారు పండ్ల వ్యాపారులు.. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కోర్టు మెట్లెక్కారు.. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెబుతోంది ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్న మార్కెట్ స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అయితే, పండ్ల వ్యాపారులు ఖాళీ చేసేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది ప్రభుత్వం.. ఖాళీ చేసేందుకు ఈ నెల 30వ తేదీ వరకు సమయం ఉన్నా 25 నుండే మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు తాజాగా ప్రకటించారు.. ఇతర రాష్ట్రాల నుండి పండ్లు వస్తున్న సమయంలో ఇప్పుడు మార్కెట్ మూసివేత ప్రకటనపై హై కోర్టును ఆశ్రయిచిన వ్యాపారులు.. ఉన్న ఫలంగా మార్కెట్ నుండి ఖాళీ చేయలేం అంటూ హైకోర్టుకు తమ గోడు వెల్లబోసుకున్నారు.. అయితే, తాత్కాలిక మార్కెట్ లో కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు తెలిపింది సర్కార్.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.