కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకని వంద మంది మహిళలు యాదాద్రి భువనగిరిలో జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అందులో 20 మందికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. ఆపరేషన్ చేయబోమంటూ డాక్టర్లు చేతులెత్తేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.తుర్కపల్లి, రాజపేట్ మండలాల నుంచి వంద మంది మహిళలను బీపీఎల్ క్యాంపు తీసుకొచ్చారు. ఒకేసారి వంద మంది రావడంతో మేము కొంతమంది ఆపరేషన్ చేస్తామని చెప్పి మిగిలిన వారికి చేయమని డాక్టర్లు చెప్పారు. మరోరోజు వస్తే… ఆపరేషన్ చేస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానాలిచ్చారు.
ఈరోజు వచ్చిన అందరికీ ఆపరేషన్ చేయాలని మహిళలు పట్టుపట్టారు. దీంతో ఎవరికీ చేసేది లేదు అంటూ.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ సిద్ధం చేసిన మహిళలను కూడా మధ్యలో వదిలిపెట్టి వెళ్లారు డాక్టర్లు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళల కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందితో గొడవకు దిగారు. మరోవైపు ఆశా కార్యకర్తలు కుని చికిత్స కోసం వారిని తీసుకొచ్చారు. ఇంతమందిని గ్రామాల నుంచి భరోసా ఇచ్చి తీసుకువస్తే వైద్యులు ఆపరేషన్ చేయకుండా వెనక్కి పంపడం బాధించిందని చెబుతున్నారు.