Etela Rajender Comments On CM KCR: తెలంగాణలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని అన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయజెండానే అని అన్నారు. ప్రజాసంబంధ పథకాలను కేసీఆర్ ఎప్పుడూ తీసుకురాలేదని.. పవర్ ఓరియెంటెడ్ పాలసీలనే తీసుకువస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ‘దళిత బంధు’ గుర్తుకు వచ్చిందని.. మునుగోడులో గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ‘గిరిజన బంధు’ ఇస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా దళితబంధు ఇస్తానన్న మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.
తాగుడు మీద ఆధాయం పెంచుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. తెలంగాణ వచ్చినప్పుడు ఎక్సైజ్ ఆదాయం రూ.10,700 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.45,000 కోట్లకు చేరుకుందని అన్నారు. నెల మొదటి తారీఖు జీతం ఇవ్వకపోవడమే ధనిక రాష్ట్రమా అని ఈటెల ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేసీఆర్ చేతుల్లో మరమనుషులుగా మారారని ఆరోపించారు. 5800 ఎకరాల ఎస్సీల భూములను లాక్కున్న లాండ్ బ్రోకర్ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అందరి చూపు బీజేపీ వైపే ఉందని ఆయన అన్నారు.
Read Also: Kalvakuntla Kavitha: ఆ ఘనత ఒక్క కేసీఆర్‌దే.. రకరకాల మాటలు పట్టించుకోవద్దు
సీఎం ఉంటే ప్రగతి భవన్ లో లేదంటే ఫామ్ హౌజులో అని.. ఏ సీఎం అయినా సచివాలయాని వస్తారు.. ప్రజా సమస్యలు తెలుసుకుంటారు కానీ కేసీఆర్ రాజు, చక్రవర్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొత్త సచివాలయం కట్టే లోపు ఈ ప్రభుత్వం పోతుందని అన్నారు ఈటెల రాజేందర్. ఎక్కడ పడితే అక్కడ తెలంగాణలో మద్యం దొరుకుతుందని విమర్శించారు. సంక్షేమ పథకాలకు ఇచ్చేది రూ.26 వేల కోట్లని.. మద్యం ద్వారా లాక్కుంటోంది రూ.45 వేల కోట్లని ఈటెల అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలు పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటాయి కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటోందని విమర్శించారు.
చాయ్ అమ్ముకునే వారిని కూడా దేశప్రధానిగా చేసిన ఘనత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దే అని ఈటెల అన్నారు. తెలంగాణ ఏర్పాటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే సాధ్యం అయిందని ఆయన అన్నారు. మోదీ గారి గురించి సీఎం కేసీఆర్ జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని.. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయం అంటే అవినీతి అనే అభిప్రాయం ఉన్న దేశంలో అవినీతి మచ్చ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి నరేంద్ర మోదీ అని పొగిడారు. ప్రపంచం భారతదేశాన్ని పొగుడుతుంటే.. కేసీఆర్ మాత్రం తిడుతున్నారని అన్నారు.