తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. శుక్రవారం నగరంలో జరిగిన క్రెడాయ్ సమావేశంలో మంత్రి కేటీఅర్ మాట్లాడుతూ.. ఆంధ్రలో ఉన్న తన మిత్రుడు తెలంగాణ వారిని బస్సులో ఆంధ్రకు తీసుకొని వచ్చి, అక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా ఎంత అధ్వానంగా ఉందో చూపించాలని కోరినట్లు మంత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యానించడంపై డీకే అరుణ స్పందిస్తూ.. శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేసారు.
కేటీఆర్ తన మిత్రుడు ఎవరో చెప్తే కాదు, తాను స్వయంగా అతడిని గద్వాలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు తీసుకొని వెళ్ళి, అక్కడ రోడ్లు, నీటి, విద్యుత్ సరఫరా ఎంత ఘోరంగా ఉన్నాయో చూపిస్తానన్నారు. కేటీఅర్ స్నేహితుడు కేవలం కల్వంకుంట్ల వారి ఫార్మ్ హౌస్ చుట్టుప్రక్కల ప్రాంతాలు చూసి, మొత్తం రాష్ట్రం అంతా అదే విధంగా ఉంటుందన్న భ్రమలో ఉన్నట్టున్నారని డీకే అరుణ ఎద్దేవా చేసారు. దానికి తోడు కేటీఆర్ సొంత డబ్బా కొట్టుకోవడంలో సిద్ధ హస్తుడన్న విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసన్న విషయం కేటీఆర్ మర్చినట్టు ఉన్నారని డీకే అరుణ చురకలు అంటించారు.