మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 8 ఏళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తుండటంతో అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. చిత్తశద్ధి ఉంటే అర్హులైన భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి మూడు సంవత్సరాలలో గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని సవాల్‌విసిరారు.
గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు ప్రభుత్వ భూమి ఉండగా 45 ఏకరాల స్థలాన్ని నిరుపేదలకు కేటాయించిన భూమిని హాస్పిటల్ కు, నర్సింగ్ కాలేజీకి కేటాయించడం శోచనీయమన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించాలని ఆమె వ్యాఖ్యానించారు. అధికార మదంతో పేదప్రజల కడుపుకొడితే పుట్టగతులు ఉండవని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా ఆమె.. రైతుల పాలిట ధరణి శాపంలా మారిందన్నారు.