సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2017లో ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారే ఎరువుల ధరలను 50 శాతం పెంచడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు.
Read Also: జంటనగరాల పరిధిలో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
రైతులకు రుణమాఫీ చేయలేని ప్రభుత్వం రైతుబంధు పేరుతో సంబరాలు చేసుకుంటోందని ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, పోలీసులు కుమ్మక్కై అమాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కార్యకర్తలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 2023లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం పక్కా అని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో 50వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు.