CM Revanth Reddy : వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ఎన్కేపల్లి రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తూ, ముందున్న పది సంవత్సరాలు ‘ఇందిరమ్మ రాజ్యం’గా నిలుస్తాయని సీఎం ప్రకటించారు. అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగిద్దామని ప్రజలను పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రూ. 5 వేల కోట్లతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని, దీని ద్వారా వచ్చే మూడు సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మూలాల భూములకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లగచర్లలో జరిగిన ఉద్రిక్తతలు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు దురుద్దేశపూరితమని విమర్శిస్తూ, అడిగినంత భూ పరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.
లగచర్ల, హకింపేట ప్రాంతాల్లో 3 నుండి 4 వేల ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించేలా లగచర్ల పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామని చెప్పారు. “తెలంగాణకు నోయిడా మాదిరిగా లగచర్లకు ప్రత్యేక గుర్తింపు తెస్తాం” అని స్పష్టం చేశారు. కొడంగల్‌లో రైల్వే ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవుతుందని, ఎన్నో దశాబ్దాల కల ఇలా నెరవేరబోతోందని అత్యంత ఆత్మవిశ్వాసంతో చెప్పారు. కొడంగల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు కూడా త్వరలో ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నాణ్యత కలిగిన చీరల పంపిణీ జరుగుతోందని, అధికారులు ఇంటింటికి వెళ్లి వాటిని అందించాలని సూచించారు. ప్రజలు ఆ చీరలను ధరించి ఎన్నికల రోజున ప్రభుత్వం చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. గతంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం చూపారని, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఆడబిడ్డలు, మహిళలు జారవిడవకూడదని ఆయన పిలుపునిచ్చారు. కొడంగల్ అభివృద్ధి కొత్త దిశలో సాగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి ప్రజలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.