తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ 9వ తేదీ చాలా ప్రత్యేకమైనది.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు.. అంటే 2009 డిసెంబర్ 9న తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు లభించింది.. ఉవ్వెత్తున్న ఎగసిన ఉద్యమం ఓవైపు, ఆత్మబలిదానాలు మరోవైపు, ఉద్యమనేత కేసీఆర్ అకుంఠిత దీక్ష.. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం.. తెలంగాణపై ప్రకటన చేసింది.. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన సందర్భం. ఉద్యమనేత, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నవంబర్ 29, 2009న ఆమరణ దీక్ష చేపట్టారు.. 11 రోజులపాటు ఆయన దీక్ష కొనసాగింది.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. అంటూ దీక్షకు దిగారు.. దీంతో, ఓవైపు విద్యార్థులు, మరోవైపు జేఏసీ.. వివిధ రాజకీయ పార్టీలు.. ఇలా అందరూ ఏకం కావడంతో.. చివరకు కేంద్రం తెలంగాణను ప్రకటించింది.. దీంతో.. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణలో ఒక చారిత్రాత్మక దినంగా నిలిచింది.. అయితే, ఇవాళ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు గులాబీదళపతి, సీఎం కేసీఆర్..
Read Also: Airport Express Metro: నేడే సీఎం కేసీఆర్ శంకుస్థాపన.. అప్పా పోలీసు అకాడమీ సభలో సీఎం ప్రసంగం
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ.. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మానం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు.. ఇక, దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.. గురువారం రోజే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేందుకు అంగీకరిస్తూ ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన జారీ చేసింది.. అయితే, ఇవాళ హైదరాబాద్ వేదికగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. ఇవాళ మధ్యాహ్నం 1: 20 గంటలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం కార్యక్రమం జరగబోతోంది.. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు.. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకాబోతున్నారు.. మొత్తంగా తెలంగాణ ప్రకటన వచ్చిన రోజునే.. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారబోతోంది.
ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్‌గా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీ పేరు మారుస్తూ తీర్మానం చేసిన రోజు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.. దేశ రాజకీయాల్లోకి అడుగు పెడదామా? నాతో వస్తారా? అంటూ ఏ సభ జరిగినా.. ప్రజల స్పందన తెలుసుకున్న కేసీఆర్.. ఆ తర్వాత పార్టీ పేరు మార్చారు.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.. బీఆర్ఎస్‌ను అధికారికంగా ప్రారంభించబోతున్నారు.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆయన పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. దీని కోసం పార్టీ ప్రత్యేకంగా ఓ విమానాన్నే కొనుగోలు చేసేందుకు సిద్ధమైన విషయం విదితమే.