CM KCR Destroyed Telangana With Tuglak Decisions Says Vivek Venkataswamy: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తుగ్లక్ నిర్ణయాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు. మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని పూర్తిగా మరిచిపోయారన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని మాటిచ్చిన కేసీఆర్.. కేవలం తన కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారం చేసేందుకే పని చేస్తున్నారని, ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిన కేసీఆర్.. తన కుటుంబానికి చెందిన ఆరుగురికి మాత్రం పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదని వివేక్ వెంకటస్వామి చెప్పారు. రైతులకు ఫ్రీ ఫెర్టిలైజర్స్, ఉచిత విద్య, దళితులకు మూడెకరాలు ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్న మాటని సైతం తప్పారన్నారు. భగీరథ పథకం విషయంలో టీఆర్ఎస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, పోలీసులను వాడుకుంటూ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్కు పోయే కాలం దగ్గర పడిందని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా సరే.. మునుగోడులో బీజేపీ గెలుపుని ఆపలేరని వెల్లడించారు.
అంతకుముందు.. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ఒక్క కేసీఆర్‌కి మాత్రమే దక్కుతుందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేసీఆర్ తన ఆస్తులు మాత్రమే పెంచుకున్నారన్నారు. 86 మంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాలను పట్టించుకోకుండా.. మునుగోడులో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు ప్రజల్ని కోరారు.