Chikoti Praveen Says He Is Getting Threat Calls: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కుండబద్దలు కొట్టాడు. తనకు +447881695247, 9606230648 అనే నంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయని.. హిట్‌మెన్ అనే విదేశీ యాప్‌లో తన పేరుపై సుపారీ ఇచ్చినట్టు బెదిరిస్తున్నారని అన్నాడు. తన ఇంటి వద్ద సైతం గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నాడన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను తనకొచ్చిన బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, భద్రత కోసం హైకోర్టులో పిటిషన్ సైతం వేశానని తెలిపాడు.
విచారణలో రాజకీయ నేతల పేర్లను రివీల్ చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, తమ రాజకీయ స్వార్థం కోసం కొందరు తన భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నారని చికోటి ఆరోపణలు చేశాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, క్యాసినో ఒక లీగల్ బిజినెస్ అని, ఎటువంటి హవాలాకు పాల్పడలేదని చెప్పాడు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నాడు. కేవలం క్యాసినో వ్యవహారంలోనే ఈడీ విచారణ జరుపుతోందని మరోసారి స్పష్టతనిచ్చాడు. సినీ ప్రముఖుల ప్రమోషన్‌కు సంబంధించిన చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని, ఎక్కడా అవినీతి జరలేదని అన్నాడు.
తన క్యాసినోకి వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన మాట వాస్తవమేనని బాంబ్ పేల్చిన చికోటి.. అది వారి వ్యక్తిగతమని, వారి విషయాలను తాను బయటపెట్టలేనని పేర్కొన్నాడు. తనకు అన్ని రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలున్నాయని, కానీ రాజకీయాలతో మాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన ఫాంహౌజ్‌లో ఉన్న జంతువుల్ని సైతం నిబంధనల ప్రకారమే పెంచుతున్నానని, వాటికి అనుమతులున్నాయని చెప్పాడు. పురాతన వస్తువులు కూడా కేరళ మ్యూజియం నుంచి లీగల్‌గా కొన్నవేనన్నాడు. విచారణకు ఈడీ ఎప్పుడు పిలిచినా, వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చికోటి ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.