బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రెవెన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ పై తీవ్రంగా విమర్శించారు. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు మాత్రం తీరలేదు. సీఎం మాటలకు… చేతలకూ పొంతన లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు, మాజీ సైనికాధికారులుసహా ప్రజలు దీనివల్ల అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు.రాష్ట్రంలో ఉన్న మొత్తం భూముల్లో పోడు భూములెన్ని? పట్టా భూములెన్ని? అసైన్డు, పోరంబోకు, ఇనాం భూములెన్ని అనే విషయాలు ఇంతవరకు స్పష్టం చేయలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం వందల కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర నిధులును దారి మళ్లిస్తూ తన కుటుంబం, బినామీ సంస్థలకు ఉపయోగపడేలా ‘ధరణి’ పోర్టల్ ను తీర్చిదిద్దడం దురదృష్టకరమన్నారు. 1935లో నిజాం కాలం నాటి నిజాం రికార్డులనే ప్రామాణికంగా తీసుకుంటుండంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.అసైన్డు భూముల రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని గౌరవ హైకోర్టు రెండు సార్లు తీర్పులిచ్చినా పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు.ప్రజల మధ్య కొట్లాడి పెట్టి సైకో మాదిరిగా సంతోషపడుతున్న ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుందని బండిసంజయ్ విమర్శించారు.
Read Also: ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు..
ధరణి పూర్తిగా తప్పుల తడక… పేర్లు తప్పు, ఫొటోలు తప్పుగా చూపుతున్నారు. తక్కువ ఎకరాల భూమి ఉన్నట్లు చూపిస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల పట్టా ల్యాండ్ రైతులకూ క్రాప్ లోన్లు రాని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ నిర్వాహక సంస్థలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే… ధరణి బాధ్యతలను పేరు గాంచిన సంస్థలకు అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పట్టా భూములను నిషేధిత జాబితాలో పేర్కొనడం అన్యాయమని మండిపడ్డారు. సామాన్యులు ఈ విషయంపై ముఖ్యమంత్రి, మంత్రులను కూడా కలవలేని దుస్థితి తెలంగాణలో నెలకొందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్లు ఈ సమస్యలతోనే సతమతమవుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ లో 5 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే… సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికా…. వేల కోట్ల రూపాయల విలువైన భూములను దండుకోవడానికి ధరణి పోర్టల్ ప్రవేశపెట్టారో తెలియడం లేదన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించాలి. రెవెన్యూ చట్టాలు ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలి. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు సైతం తమ భూములను అమ్ముకునే వీలు లేకుండా ఆ భూములను నిషేధిత జాబితాలో పేర్కొనడం అత్యంత హేయమైన చర్యగా బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి…. ఆ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలన్నారు.ప్రజల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని బండి సంజయ్ వెల్లడించారు.