బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. హైదరాబాద్ కేంద్రంగా జూలై 2,3 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల వేదిక గురించి ఈ రోజు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్.సంతోష్ హైదరాబాద్ లో పర్యటించిన వారు హెచ్‌ఐసీసీ వేదికను ఖరారు చేశారు. కార్యవర్గ సమావేశాలపై రాష్ట్ర నేతలైన విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి,ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్,పొంగులేటి సుధాకర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు.
కేసీఆర్ ఇలాకాలో బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులతో పాటు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు రెండు రోజుల పాటు హైదరాబాద్లో బస చేయనున్నారు. ప్రధాని మోదీ రాజ్ భవన్ లో బస చేస్తారని.. ఇతర కేంద్ర మంత్రులు, నేతలు ప్రముఖ హోటళ్లలో బస చేయనున్నారు.
ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి బీజేపీ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తుంటుంది. అయితే కోవిడ్ కారణంగా చాలా రోజులు వాయిదా పడిన ఈ సమావేశాలు చివరిసారిగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు 2021 నవంబర్ లో జరిగింది. పార్టీ సంస్థాగత నిర్ణయాలు, వర్తమాన రాజకీయాలు, ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతుంటాయి. దీంతో పాటు 2024 ఎన్నికల ఎజెండా కూడా సమావేశాల్లో చర్చించనున్నారు. ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తున్నారు సీఎం కేసీఆర్. మోదీకి వ్యతిరేఖంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ నేతలను ఒకే తాటిపైకి తెచ్చే విధంగా కార్యచరణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబ రాజకీయాల గురించి తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. అంతకుముందు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. తాము తెలంగాణపై ఫోకస్ పెట్టామనే స్పష్టమైన సంకేతాలు టీఆర్ఎస్ పార్టీకి పంపించారు.