సొంత స్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా సూర్యపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పై విమర్శల వర్షం కురింపించారు. 2014లో రాష్ర్ట అప్పులు రూ.65వేల కోట్లు ఉండగా.. ఏడున్నరేళ్లలో ఆ అప్పును రూ.4 లక్షలకు కోట్లకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన ఆరోపించారు. ప్రతి నెల రూ.65 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితికి రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని ఈటల ఎద్దేవా చేశారు.
విద్యార్థులకు హాస్టల్ బిల్లులను కూడా చెల్లించలేదని మండిపడ్డారు ఈటల.. ఆరోగ్య శ్రీ బకాయిలు సైతం ఇప్పటి వరకు చెల్లించలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌కు అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమం అవసరం లేదన్నారు. ఓ వైపు వరి ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆయన మాత్రం ఏమి పట్టన్నట్టు ఉన్నారన్నారు. ఇప్పటికైనా కేంద్రం పై విమర్శలు మాని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేసే రోజు దగ్గరలోనే ఉందని ఈటల పేర్కొన్నారు.