బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేస్తే… కాంగ్రెస్ పాలనలో వాటిని తెరవకపోగా ఒక్క ఏడాదిలోనే 1500 స్కూల్స్ మూసివేశారని చెప్పారు. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని గాలికొదిలేశారని, ఫీజు రీయంబర్స్ మెంట్ రాక కాలేజీలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం తాము మద్దతిచ్చినా కొన్ని కాలేజీ యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వానికి భయపడి రాజీ పడుతున్నాయన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విషయంలో విద్యార్ధులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యా సమస్యలపై ఏబీవీపీ చేస్తున్న ఉద్యమాలు ఉధ్రుతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈరోజు హైదరాబాద్ శంషాబాద్ లోని ఎస్సాస్సార్ కన్వెన్షన్ లో ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సభలకు రాష్ట్ర విద్యార్ధి పరిషత్ అధ్యక్షులు హెచ్ సీయూ ప్రొఫెసర్ రావుల క్రిష్ణ, కార్యదర్శి రాంబాబు, కర్నె రామచందర్, గీతాసింగ్, భీమనపల్లి శ్రీకాంత్ హాజరైన ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పానగల్ కు చెందిన సామాజిక కార్యకర్త, హెచ్ఐవీ బాధితులకు, వారి పిల్లలకు అనేక రకాలుగా సేవలందిస్తున్న భీమనపల్లి శ్రీకాంత్ కు ‘జనమంచి గౌరీశంకర్ జీ యువ పురస్కార్ ను’ కేంద్ర మంత్రి అందజేశారు. అనంతరం మహాసభలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ‘జనమంచి గౌరీశంకర్ జీ’ యువ పురస్కార్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. జనమంచి గౌరీశంకర్ జీ వ్యక్తి. విద్యార్థులకు ఐకాన్. ఇంటిపేరును సార్ధకం చేసుకున్న జనం మనిషి గౌరీజీ. ఏబీవీపీయే ఆయన జీవితం. బాల్యం నుండి చనిపోయేదాకా ఏబీవీపీకే సిద్దాంతాలకే అంకితమైన నాయకుడు. ఎమర్జెన్సీ టైంలో జైలుకు పోయిన గౌరీజీ ఉమ్మడి ఏపీలో విద్యార్ధి పరిషత్ ను అంచెలంచెలుగా ఎదిగేలా చేసిన వ్యక్తి గౌరీజీ. విద్యార్థి నాయకులకు శిక్షణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు.
1983లో నక్సల్స్‌కు వ్యతిరేకంగా తొలి ఉద్యమం ప్రారంభించిన ఏబీవీపీ నాయకుడు గౌరీశంకర్ జీ. ఉగ్రవాదంపై కూడా విద్యార్థులను చైతన్యం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాడారు. ఎంతో మంది విద్యార్ధి నాయకులను నక్సల్స్ చంపినా.. వారి శవాలను తన భుజాలపై మోసిన గౌరీజీ… ఒక్కరు చనిపోతే.. వందల మంది ఏబీవీపీ నాయకులను తయారు చేసిన లీడర్ గౌరీజీ.
పోస్టర్లు వేసి డేట్ వేసి ఫలానా టైంలో చంపుతామంటూ నక్సల్స్ హెచ్చరించినా సామా జగన్మోహన్ వంటి ఏబీవీపీ నాయకులెవరూ పారిపోలేదు. చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని ఎదురొడ్డి నిలిచి ప్రాణత్యాగం చేసిన నాయకులు ఏబీవీపీలో ఉన్నారు. దేశాన్ని సరిహద్దులో జవాన్లు రక్షిస్తే… దేశంలో విద్యార్ధి పరిషత్ నాయకులు దేశరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నారు. నక్సలైట్లు నల్ల జెండా ఎగరేస్తే వారిని ఎదిరిస్తూ జాతీయ జెండా ఎగరేసిన నాయకుడు సామ జగన్మోహన్ రెడ్డి. నక్సలైట్లు బుల్లెట్ల వర్షం కురిపించినా భారతమాతాకీ జై అంటూ… చివరి శ్వాస వదిలిన నాయకుడు సామ జగన్మోహన్ రెడ్డి.
ఒకనాడు గ్రామాల్లోకి, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్త తిరిగి వస్తారో లేదో, నక్సల్స్ తూటాలకు బలైతారేమోనని క్షణక్షణం ఆందోళన పడ్డ క్షణాలు ఇప్పుడు లేవు. బూజుపట్టిన సిద్దాంతం పేరుతో పేదలను, గిరిజనులను, ఏబీవీపీ కార్యకర్తలను చంపుతున్న నక్సల్స్ ను ఏరివేస్తున్న మహానాయకుడు మోదీ. ఆయన నాయకత్వంలో అమిత్ షా ఆధ్వర్యంలో 2026 మార్చి నాటికి ‘నక్సల్స్ ముక్త్ భారత్’ తథ్యం. భయపడే పరిస్థితే లేదు. నక్సల్స్ కు వ్యతిరేకంగా విద్యార్ధి పరిషత్ చేతులకు బుల్లెట్లు ఇచ్చి ఉంటే ఎప్పుడో వారిని అంతం చేసే వారు. కానీ గౌరీజీ ఏనాడూ విద్యార్ధులకు బుల్లెట్ పాఠాలు బోధించలేదు. బ్యాలెట్ ను నమ్మకుని పనిచేయాలని నిరంతరం నూరిపోశారు. అందుకే బ్యాలెట్ నమ్ముకున్నోడు ఉన్నతంగా ఎదిగారు. బుల్లెట్ ను నమ్ముకున్నోళ్లు అంతరించిపోయారు.
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని కోరితే… తల్లిదండ్రుల ఎదుటే పిల్లలను కట్టేసి చంపేసిన ఉగ్రవాదుల దుర్మార్గాలను మర్చిపోలేం. దేశం కోసమే పనిచేస్తున్నామని చెప్పే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు… ఎన్ఎస్ యూఐ, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్ధి సంఘాలు ఎందుకు ఆర్టికల్ 370 రద్దు కోసం ఎందుకు పోరాటాలు చేయలేదు? దేశం కోసం ఎందుకు ఉద్యమించలేదో సమాధానం చెప్పాలి. ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జనసంఘ్ నాయకులు మాత్రమే 370 ఆర్టికల్ కోసం పోరాడారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి వారు బలిదానం చేశారు. వారి త్యాగాలు వ్రుధా పోకూడదనే మోదీ ప్రభుత్వం 370 ఆర్టికల్ ను రద్దు చేశారు. పార్లమెంట్ లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో తానూ ఉండటంతో తన జన్మ ధన్యమైంది. 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన సాధ్వీ ప్రజ్ఝాసింగ్ ను అనేక చిత్రహింసలు పెట్టారు. ఆమె శరీరంలో పోలీసులు కొట్టని పార్ట్ లేదు. కరెంట్ షాక్ ఇవ్వని పార్ట్ లేదు. 80 శాతం హిందువులున్న భారత్ లో వాళ్లకు నిత్యం కొలిచే రాముడి మందిరాన్ని అయోధ్యలో నిర్మించలేకపోతున్నారని ప్రపంచమంతా హేళన చేశారు. అట్లాగే అయోధ్య రామమందిరంలో కరసేవకుల త్యాగాలు, బలిదానాలు వ్రుధా కావొద్దని రామ మందిరాన్ని నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే.
ఈ దేశంలో ఎలాంటి సమాజం నిర్మాణం కావాలో ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నా. ఒకనాడు ఏబీవీపీ కార్యకర్తలు గోడలపై వాల్ పోస్టర్ రాయాలంటే… కాల్చేసిన బీడీని ఇంకులో ముంచి, పాత బట్టతో జాజులో ముంచి రాసేవాళ్లం. మా అక్క పెళ్లి టైం ఒకవైపు మాకు ఎగ్జామ్స్ ఇంకోవైపు… ఆ టైంలో కూడా కాలేజీ గోడలపై వాల్ రైటింగ్ రాసిన జ్ఝాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నక్సలైట్ల, టెర్రరిస్టుల సమస్య లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం విద్యా రంగ సమస్యలతో అల్లాడుతోంది.
పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో క్లాస్ రూముల్లో చీకటి రాజ్యమేలుతోంది. స్కూళ్లో టీచర్ లేడు. టాయిలెట్లు లేవు. బెంచ్ లు లేవు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు కూడా లేదు. ఒక ప్రభుత్వం విఫలమైతే ఒక ఎన్నిక పోతుంది. విద్య విఫలమైతే – ఒక తరం పోతుంది! కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో రెండు తరాలు నష్టపోయేంతగా విద్యా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.
కానీ దురద్రుషక్టం ఏందంటే… కాంగ్రెస్ ను గెలిపించిన పాపానికి వేలాది టీచర్ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. స్కావెంజర్స్ లేక ఊడ్చేవాడు లేక స్కూళ్లు అల్లాడుతున్నాయి. టీచర్లు, సౌకర్యాల్లేక పోవడంతో ఒక్క ఏడాదిలోనే (2024-25 విద్యా సంవత్సరంలో) రాష్ట్రంలో 2 వేల 81 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. బీఆర్ఎస్ పాలనలో మూసివేసిన 6 వేల పాఠశాలలను తెరిపిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ…అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోగా.. దాదాపు 1500 స్కూల్స్ ను మూసివేశారు.
ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. పోస్ట్ కార్డు కూడా ఇయ్యలే. ప్రతి విద్యార్ధికి ఇంటర్నెట్, వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. కరెంట్, నీళ్లు, సరైన తిండికి దిక్కులేక హాస్టల్ విద్యార్థులు అల్లాడుతూ ఫుడ్ పాయిజన్ తో వందలాది మంది చనిపోతున్నా గాలికొదిలేసినోళ్లు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం సిగ్గు చేటు.. 18 ఏళ్లు దాటిన యువతులకు స్కూటీ ఇస్తామన్నారు. ఊసే లేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు టెన్త్ పాసైతే రూ.15 వేలు, ఇంటర్ చేస్తే రూ.25 వేలు, డిగ్రీ చేస్తే రూ.50 వేలు, పీజీ చేస్తే రూ.లక్ష ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేశారు.
గత నాలుగేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా గత మూడేళ్లలో వందలాది కాలేజీలు మూతపడ్డాయి. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు పలుమార్లు నావద్దకు వచ్చినా వారికి మద్దతుగా పోరాటం చేస్తానని చెప్పిన. ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం మేం యుద్దం చేస్తుంటే.. కాలేజీ యాజమాన్యాలు వెనకడుగు వేసి రాజీపడి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఏబీవీపీ మద్దతిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ పై దిగొస్తుందని కాలేజీ యాజమాన్యాలే చెబుతున్నాయంటే… ఏబీవీపీ అంటే ఏమిటో అర్ధం చేసుకోవాలి. దురద్రుష్టవశాత్తు ఏబీవీపీ చేసే ఉద్యమాలను ప్రజల్లోకి వెళ్లడం లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాది వ్యవధిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ భర్తీ చేస్తామని చేయలేదు. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, సాంపుల్ ఇంప్లిమెంటేషన్‌కే పరిమితమయ్యింది. ప్రైవేటు సెక్టారులోని ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట తప్పింది.
విద్యా రంగంలో ఇన్ని సమస్యలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తోంది. గౌరీ శంకర్ జీ స్పూర్తితో పెద్ద ఎత్తున పోరాటాలకు నడుం బిగించాల్సిందిగా ఈ రాష్ట్ర మహాసభల వేదికిగా ఏబీవీపీ నాయకులను కోరుతున్నా. ఏ ఆశయం కోసం ఎంతో మంది విద్యార్ధి నాయకులు బలయ్యారో.. వాటిని కొనసాగించడం ద్వారా వాళ్లకు అందించే నిజమైన నివాళి అర్పించినట్లు.’ అని బండి సంజయ్ అన్నారు.
Kavitha New Party: కొత్త రాజకీయ పార్టీ వస్తుంది.. నన్ను ఆశీర్వదించండి!