ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందని చెప్పారు. ‘తెలంగాణ జాగృతి’ రాజకీయ పార్టీగా మారుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొత్త రాజకీయ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తాను కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగా శాసనసభ నుంచి వెళ్తున్నానని, రాజకీయ శక్తిగా తిరిగివస్తానని చెప్పుకొచ్చారు. తనను ఆశీర్వదించండని, తనతో పాటు నడవండని కవిత కోరారు.
‘కౌన్సిల్లో ఇవాళ మరొకసారి నా రాజీనామాను అనుమతించాలని కోరాను. నైతికత లేకపోతే మనుషులకు, జంతువులకు తేడా ఉండదు. తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి పోస్టులు ఇవ్వకపోవడం దారుణం. తొమ్మిదిన్నర సంవత్సరాలలో రూ.14 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇందులో 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు. ఒక లక్ష 89 వేల కోట్లు కేవలం ఇరిగేషన్ కే పెట్టామని ప్రభుత్వం చెప్పింది. ఇంత ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎందుకు ఇళ్ళు కట్టి ఇవ్వలేకపోయింది. ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు గుర్తించలేదు. నిరుద్యోగులను మోసం చేస్తూ వచ్చింది, మభ్యపెట్టి మోసం చేశారు తప్ప ఒరిగిందేమీ లేదు. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడేందుకు పార్టీ రావాల్సి ఉంది. తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా ఎదిగి, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుంది. విధి విధానాలు ఏంటి అన్నది తొందరలో చెప్తాము. రాబోయే ఎన్నికల్లో నిలబడి ప్రజల పక్షాన నిలబడి ఒక శక్తిగా చట్టసభల్లో తిరిగి అడుగుపెడుతుంది. సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ రావాలనుకుంటున్నారో.. అలాంటి వారు నాకు మద్దతు ఇవ్వండి’ అని కవిత చెప్పారు.
‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటివరకు విద్యార్థులకు రాలేదు. అందుకే విద్యార్థి నాయకులను జాగృతిలో చేరాలంటూ పిలుపునిస్తున్నాను. అవమానభారంతో ఇంటి పార్టీ నుంచి తెంచుకొని బయటికి వస్తున్నాను తెలంగాణ మహిళలకు రోషం ఎక్కువ, అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు. అత్యంత అవమానకరంగా రెండు పార్టీలోంచి బయటకు పంపించారు. గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాము. ఆదివాసి, గిరిజన, మహిళ, మైనార్టీల కోసం పనిచేసేందుకు కొత్త రాజకీయ పార్టీగా జాగృతి ఎదుగుతుంది. రాష్ట్ర రాజకీయాలలో మార్పు తీసుకొచ్చేందుకు కావలసిన వేదికను ఇస్తాను. నా దృష్టికి వచ్చినటువంటి అసంఘిక కార్యకాల పనులను (అవినీతి కావచ్చు, రైతుల మీద కేసులు కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ సొంత నాయకుల మీద కేసులు పెట్టడం కావచ్చు, దౌర్జన్యంగా ప్రజల భూములను కబ్జా చేసిన అంశం కావచ్చు, కలెక్టరేట్ల కట్టడం కోసం అసైన్డ్ భూములను బదిలీ చేసిన అంశం కావచ్చు) ఎప్పటికప్పుడు అప్పటి నాయకత్వానికి చెప్తూ వచ్చాను. తెలంగాణ సాధించిన పార్టీ అన్న మమకారంతో పనిచేశా, ఎంతో ఓపికతో పని చేశాను. పార్టీ కోసం న్యాయబద్ధంగా పనిచేసిన ఏ కార్యకర్త ఏ నాయకుడు పార్టీలో ఉండలేకపోయారు’ అని కవిత పేర్కొన్నారు.
‘నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను, కచ్చితంగా కొట్లాడుతా. రాష్ట్రంలో నాయకులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. నాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆస్తిలో వాటాలు రాక ఉద్యమం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. తల తోక లేని ఆరోపణలు చేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ చేసే చెత్త ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసే అతి చెత్త ఆరోపణలు అవాస్తవమని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను. లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్న.. నాది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. నా రాజీనామాలు ఆమోదిస్తే నాకు పూర్తి స్వేచ్ఛ వస్తుంది. ప్రజలకు ఒక వజ్రాయుధమై నేను పని చేస్తాను’ అని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.