Bandi Sanjay Sensational Comments On CM KCR: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతల్ని డంపింగ్ యార్డ్ వద్దే కట్టేయాలని.. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ ప్రసంగంలో ఆయన పిలుపునిచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే.. డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తామని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్.. మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్‌కు రావాలి’ అంటూ సవాల్ విసిరారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను కేసీఆర్ తనఖా పెట్టారని ఆరోపించిన బండి సంజయ్.. రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైందని ప్రశ్నించారు. భూకబ్జాలతో టీఆర్ఎస్ నేతలు కోట్లు దండుకున్నారని విమర్శించారు.
‘‘600 ఎకరాలను కబ్జా చేసుకోమంటే.. వెంటనే టిఆర్ఎస్ వాళ్లు వచ్చి ఆ డంపింగ్ యార్డ్‌ని కబ్జా చేసేసుకుంటారు. ఇక్కడ కొంతమంది నాయకులు జోకర్లుగా మారారు. డంపింగ్ యార్డ్, రోడ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? బోడుప్పల్లో 7 వేల ఫ్లాట్‌లకు రిజిస్ట్రేషన్ లేదు. ఈ ప్రాంతంలో 100 పడగల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ లేదు. మోడీ ఇచ్చే పైసలను డైవర్ట్ చేసి, కమిషన్ల కోసం ట్రాక్టర్లను కొనిపిస్తున్నారు. అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు టిఆర్ఎస్సే. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఎంతమంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు? ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం, నిరుద్యోగ భృతి వచ్చింది? దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదు?’’ అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ పేదల సమస్యలను గాలికొదిలేసి, జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ దేశం పట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుంటే.. బిజెపి అంటేనే కెసిఆర్ గజగజా వణుకుతున్నాడని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్ అని కలెక్టర్ పొగడటమేంటని నిలదీశారు. ఆదివాసీ రాష్ట్రపతి అభ్యర్ధికి ఓటేయని కేసీఆర్.. గిరిజనకు రిజర్వేషన్లు ఇస్తామంటూ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని.. ఉఫ్‌మని ఊదితే కూలిపోతుందని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు ఈడీ అంటే కొవిడ్.. సీబీఐ అంటే కాలు విరుగుతోందని సెటైర్లు వేశారు. పేదోళ్ల కోసమే సంవత్సరం నుంచి తాము పాదయాత్ర చేస్తున్నామన్నారు. కాగా.. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 7వరోజుకు చేరుకుంది. జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ఆయన యాత్ర సాగుతోంది. దారి వెంట ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఆయన.. దమ్మాయిగూడ చౌరస్తాలో మాట్లాడారు. అక్కడ ప్రధానంగా ఉన్న డంపింగ్ యార్డ్‌ను తరలించి తీరుతామని హామీ ఇచ్చారు.