కరీంనగర్లో కొనసాగిస్తోన్న హిందూ ఏక్తా యాత్ర భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామని అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరిన ఆయన.. ‘శవం వస్తే మీది, శివలింగం వస్తే మాది’ అని అన్నారు. లవ్ జిహాదీ, మత మార్పుడులను చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణలో బీజేపీ వస్తే ఊర్దూని నిషేధిస్తామని, మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామని కుండబద్దలు కొట్టారు. కశ్మీర్ ఫైల్స్లా తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ ఫైల్స్ చూపిస్తామని వెల్లడించారు. అంతేకాదు.. కరీంనగర్లో తనను మూడు సార్లు చంపేందుకు ప్రయత్నం చేశారని బండి సంజయ్ కుమార్ తెలిపారు.
అంతకుముందు.. హిందువుల ఐక్యతను చాటిచెప్పేందుకే తాము కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. దేశంలోని హిందువుల పట్ల వివిధ రాజకీయ పార్టీల వైఖరిని తమ బీజేపీ మార్చిందని అన్నారు. మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు, ఇతర రాజకీయ పార్టీలు ఎప్పుడూ హిందువులను విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. హనుమాన్ జయంతి నాడు తాము ఏటా హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో హిందువులందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని చెప్పారు. హిందూ సమాజాన్ని చీల్చేందుకు, హిందూ దేవుళ్లను అవమానించేలా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు.
ఇదే సమయంలో.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశిస్తూ, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా ఉన్నారా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆలయ నిర్మాణానికి ఎంతో మంది కరసేవకులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలకు విలువ ఇచ్చేలా ప్రధాని ఆలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. అనంతరం.. కరీంనగర్ ప్రజల సేవలో మూడేళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని, ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో పనులు చేశానన్న బండి సంజయ్ కుమార్.. శాతవాహన యూనివర్శిటీకి, సైనిక్ స్కూల్కు 12-బి స్టేటస్ తీసుకొచ్చింది తానేనని వెల్లడించారు.