తెలంగాణ భారతీయ జనతా పార్టీలో లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కొత్త జోష్ నింపారని చెబుతారు.. ఆయనకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించిన తర్వాత తెలంగాణలోని లీడర్లలో, క్యాడర్‌లో ఉత్సాహం నింపారని.. దూకుడుగా కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తూ.. అధిష్టానం నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు.. ఆ మధ్య తుక్కుగూడ దగ్గర నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. బండిపై ప్రశంసలు కురిపించారు.. బండి సంజయ్ మాటలు వింటుంటే.. కేసీఆర్‌ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరంలేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో, బండిపై ఆయనకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే, తెలంగాణలోని కొంత మంది సీనియర్ నేతల తీరు బండి సంజయ్‌కి ఇబ్బందికరంగా మారిందట.. వారి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.. అంతే కాదు.. ఢిల్లీ పెద్దల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశారట బండి సంజయ్.
Read Also: Traffic Rules: మంత్రి, ఎమ్మెల్యే అయితే మాకేంటి..? రూల్ రూలే..
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని తీవ్ర ఆవేదనలో ఉన్నారట బండి సంజయ్.. పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే తనపై వ్యక్తిగత దాడికి పార్టీ నేతలే సహకరిస్తున్నారని బండి సంజయ్ నారాజ్ లో ఉన్నారని సమాచారం.. పార్టీలో జరుగుతోన్న కీలక పరిణామాలపై లీక్‌లు, సోషల్ మీడియాలో ప్రచారాలపై ఢిల్లీ నాయకుల వద్ద ప్రస్తావించారట తెలంగాణ బీజేపీ చీఫ్.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ పెద్దల వద్ద ఏ కరువు పెట్టిన ఆయన.. పార్టీలో చేరికలపై జరగుతున్న ప్రచారం, చేరికల అడ్డగింతపై కూడా ఢిల్లీ నేతల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. కాగా, బండి సంజయ్‌పై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు విడిగా సమావేశాలు కావడం అప్పట్లో హాట్ టిపిక్‌గా మారిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ పెంచారు.. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితర బీజేపీ కీలక నేతలుపాల్గొననున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో తన ఆవేదనను ఢిల్లీ పెద్దల దగ్గర బండి సంజయ్ వెలిబుచ్చడం చర్చగా మారింది.