‘రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ ‘… కానీ, కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి కూడా చూసిచూడనట్టు వదిలేసే సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కానీ, ఒడిశా పోలీసులు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.. బాలాసోర్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇంతకీ వాళ్లు చేసినా పనేంటి? అంటే.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఒడిశా మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా విధించారు.. ‘చట్టం అందరికీ సమానం’ అని భరోసా ఇస్తూ, బాలాసోర్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పాఠశాల మరియు సామూహిక విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మరియు ఎమ్మెల్యే స్వరూప్ దాస్‌లకు జరిమానా విధించారు.
Read Also: Flipkart MoU with SERP: ఫ్లిప్‌కార్ట్‌తో సెర్ప్ ఒప్పందం.. వారికి గుడ్‌న్యూస్..
హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిల్ నడిపినందుకు మంత్రి మరియు ఎమ్మెల్యేకు రూ. 1,000 జరిమానా విధించినట్లు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు.. మంత్రి సమీర్ రంజన్ దాస్ కూర్చున్న బైక్‌ను ఎమ్మెల్యే నడుపుతున్నారు. వారిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు… అయితే, ఆ బైక్ వారిలో ఎవరిదీ కాదు.. రాణిపటానాలోని బ్యాంక్ కాలనీకి చెందిన వాహన యజమాని పంకజ్ అగర్వాల్ పేరిట చలాన్ జారీ చేశారు పోలీసులు. అనంతరం ఎమ్మెల్యే స్వరూప్ దాస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిమానా మొత్తాన్ని చెల్లించారు.. కాగా, బాలాసోర్ లోని వివిధ పాఠశాలలను మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మెల్యేతో కలిసి ఈ రోజు ఉదయం బాలాసోర్ టౌన్ హైస్కూల్, బారాబతి బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలపై ఉపాధ్యాయులు, విద్యార్థులతో చర్చించి వారి అవసరాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ అనూహ్యంగా పెరిగినట్టు తెలిపారు.. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రెండు లక్షల మంది విద్యార్థులు వచ్చినట్టు తెలిపారు.. రాష్ట్రంలో దాదాపు 11,000 మంది కొత్త ఉపాధ్యాయులను నియమించనున్నామని, ఇందుకు ఒడిశా హైకోర్టు అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన విదేశీ పర్యటన నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. మంత్రి, ఎమ్మెల్యే పర్యటన ఉద్దేశం మంచిదైనా.. హెల్మెట్ ధరించకపోవడం రూల్స్ బ్రేక్ చేసినట్టు అయ్యింది.. దీంతో, జరిమానా విధించి ట్రాఫిక్ పోలీసులు.. చట్టం ముందు అంతా సమానమేనని చాటారు.. ఆ ప్రజాప్రతినిధులు కూడా ఆ మొత్తాన్ని చెల్లించి ఆదర్శంగా నిలిచారనే చెప్పాలి.