Bandi Sanjay : జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను విమర్శించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. “ఏయ్ బిడ్డా… జూబ్లిహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా” అంటూ ప్రారంభించిన ఆయన.. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే అని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.. ఈ రెండు పార్టీల పాలనలో జూబ్లిహిల్స్ ప్రజలకు ఒరిగిందేమిటి? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని, అయితే హరీష్ రావు చెప్పగానే ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్‌కు మద్దతిస్తే, ఆయన తమ్ముడు బీఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని, బీజేపీని ఓడించడమే మజ్లిస్ పార్టీ ప్రధాన లక్ష్యమని సంజయ్ వ్యాఖ్యానించారు. “జూబ్లిహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదు? ఈ రెండు పార్టీలతో చేసుకున్న బేరసారాలే నిదర్శనం” అని ఆయన అన్నారు. బీజేపీ గెలిస్తేనే కేంద్ర నిధులతో జూబ్లిహిల్స్ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. “కిషన్ రెడ్డి మరిన్ని నిధులు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తారు. కానీ కాంగ్రెస్ గెలిస్తే బంజారాహిల్స్ పెద్దమ్మతల్లి స్థలాన్ని మజ్లిస్‌కు ధారాదత్తం చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటారు” అని సంజయ్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌పై కోపంతో బీఆర్‌ఎస్‌కు ఓటేయడం అంటే రెండు పార్టీలకీ బలమిచ్చినట్లేనని అన్నారు. “బీజేపీని గెలిపించండి… ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పండి” అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచందర్ రావు, గౌతమ్ రావు, పాయల్ శంకర్ తదితర నేతలు హాజరయ్యారు.
Accident : నార్సింగిలో కారు బీభత్సం.. బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు