Anand Mahindra : భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ విజయవంతంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమ్మిట్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి దిశ, విజన్ డాక్యుమెంట్ ఆయనను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు.
సమ్మిట్ వేదికపై మాట్లాడిన ఆనంద్ మహీంద్రా… టెక్నాలజీ ఎంత వేగంగా ఎదిగినా, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత విస్తరించినా హ్యూమన్ టచ్‌కు ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదన్నారు. మానవీయ నైపుణ్యాన్ని ఏ సాంకేతికత భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా హ్యూమన్ స్కిల్స్‌కు కీలక పాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను పరిశీలించిన తర్వాత లక్ష్యాలను మరింత విస్తృతంగా, పెద్ద స్థాయిలో పెట్టుకోవాలని అనిపించిందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఆ డాక్యుమెంట్‌ను చూస్తే నిపుణుల అభిప్రాయాలు మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రజల ఆశయాలు కూడా ప్రతిబింబించినట్లు అనిపించిందన్నారు. యువత, మహిళలు, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలు సమతుల్యంగా ఇందులో పొందుపరిచినట్లు ప్రశంసించారు.
ఇంత స్పూర్తిదాయకమైన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన దిశ, ధైర్యమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తున్న నాయకత్వం తెలంగాణలో కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. జహీరాబాద్‌లో మహిళలు నిర్వహిస్తున్న బ్యాటరీ తయారీ పరిశ్రమ తమకు గర్వకారణమని ఆనంద్ మహీంద్రా చెప్పారు.
మహిళా సాధికారత, పారిశ్రామిక అభివృద్ధి రెండూ కలిసొచ్చేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్న తన అనుభవంతో చూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఒక సమఉజ్జీలా కనిపిస్తున్నారని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో ఈ తరహా నాయకత్వం కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Duddilla Sridhar Babu : భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు