వినాయక చవితి అంటే హైదరాబాద్ అందరికీ గుర్తుకు వస్తుంది. ఈసారి వినాయక చతుర్థి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరగనున్నాయి. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల పై సమావేశం జరిగింది. జూబ్లిహిల్స్ లోని MCRHRD లో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, MLC ప్రభాకర్ రావు, MLA దానం నాగేందర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
Read Also: Loan Apps New Cheating: అకౌంట్లో డబ్బులు వేస్తారు.. చీటర్ అనే ముద్రతో వేధింపులు
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల కోసం వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే అన్ని రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఈసారి ప్రజల్లో మట్టి విగ్రహాల ప్రాధాన్యతను మరింతగా తెలియచేసేందుకు మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ ఎక్కువగా చేపట్టనున్నారు. GHMC ఆధ్వర్యంలో 4 లక్షలు, HMDA ఆధ్వర్యంలో ఒక లక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక లక్ష మట్టి విగ్రహాల పంపిణీ చేపడతారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడతాం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.
మరోవైపు హైదరాబాద్ లో గణేష్ చతుర్థి అంటే ఖైరతాబాద్ గణేశుడే గుర్తుకువస్తాడు. ఈసారి కూడా 50 అడుగుల మేర వినాయకుడు కొలువు తీరనున్నాడు. గతంలో నెలరోజుల ముందే ఈ లంబోదరుడి పనులు అన్నీ పూర్తయ్యేవి. కానీ ఈసారి వరుణుడి దెబ్బకు పనులు పెండింగ్ లో పడ్డాయి. గతానికి భిన్నంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి బదులుగా మట్టి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. సమయం దగ్గరపడుతుండడంతో పనులు వేగవంతం చేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఆ పార్వతీ తనయుడు.