Veer Savarkar vs Tipu Sultan Poster row: కర్ణాటకలో వీర్ సావర్కర్ ప్లెక్సీ తీసేసిన ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. శివమొగ్గ పట్టణంలోని అమీర్ అహ్మద్ సర్కిల్ లో వీర్ సావర్కర్ ఫ్లెక్సీని ఓ వర్గం వారు తొలగించడంతో వివాదం మొదలైంది. వీర్ సావర్కర్ ఫ్లెక్సీని తీసివేసి అక్కడ టిప్పు సుల్తాన్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంతో వివాదం మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు యువకులను దుండగులు కత్తిలో దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.
కత్తిపోట్లకు గురైన యువకుడిని 20ఏళ్ల ప్రేమ్ సింగ్, 27 ఏళ్ల ప్రవీణ్ లుగా పోలీసులు గుర్తించారు. ప్రేమ్ సింగ్ తన ఇంటి ముందు నిల్చున్న సమయంలో దుండగులు దాడి చేశారు. ప్రవీణ్ గాంధీ బజార్ ప్రాంతంలో దుకాణాన్ని మూసేసి తిరిగి వస్తున్న క్రమంలో ఆయనను కత్తిలో పొడిచారు. ప్రస్తుతం వీరిద్దరు ఆస్పత్రిలోొ చికిత్స పొందుతున్నారు. వీర్ సావర్కర్ ఫ్లెక్సీ తొలగింపులో పాల్గొన్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది కోసం గాలింపు జరుగుతోంది. తాజాగా బుధవారం ఈ వివాదం మరో నగరానికి పాకింది. తుముకూరులో కూడా ఇలాగే కొంతమంది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వీర్ సావర్కర్ బ్యానర్ ని చింపేశారు.
Read Also: Asaduddin Owaisi: కాశ్మీర్ పరిస్థితికి మోదీ, అమిత్ షానే కారణం..
ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని.. హోమంత్రి ఆరగ జ్ఞానేంద్రను ఆదేశించారు.. శివమొగ్గకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సీఎం బస్వరాజ్ బొమ్మై ఆదేశించారు. శివమొగ్గ వ్యాప్తంగా పోలీసులు సెక్షన్ 144 విధించారు. ఆగస్టు 18 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఏడీజీపీ లా అండ్ ఆర్డర్ అధికారి అలోక్ కుమార్, ఇతర పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని.. స్వాతంత్య్రం కోసం పోరాడిన వీర్ సావర్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.