మాజీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సంపద మీద ఆశతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రగతిపథంలో దేశంలోనే అగ్రభాగంలో ఉందని.. దీన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. కొన్ని పార్టీలు పాదయాత్రల పేరుతో తెలంగాణను, సీఎం కేసీఆర్ ను అపఖ్యాతి చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆశతో ఉన్నోడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు.. ఆశయంతో ఉన్నవారికి అధికారమిస్తే అభివృద్ధి చేస్తారని దానికి నిదర్శనమే కేసీఆర్ అని చెప్పారు. గతంలో కుట్రలు, కుతంత్రాలతో అధికారమే పరమావధిగా కొందరు నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇక, రాయలసీమ డీఎన్ఏ ఉన్న షర్మిల సైతం ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు గుత్తా.. తెలంగాణ గురించి షర్మిలకు ఏం తెలుసుని ప్రశ్నించిన ఆయన.. ఏపీలో అవకాశం లేక షర్మిల తెలంగాణపై పడ్డారని ఆరోపించారు. రైతులకు కష్టాలు లేకుండా చేయడానికి రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారన్నారు. హుజూరాబాద్ బై పోల్ లో.. గెల్లు శ్రీనివాస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని, అడ్డదారుల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
ఈసీ, పారా మిలటరీ దళాలు అడ్డు పెట్టుకొని గెలవాలని బీజేపీ చేస్తోందని, పశ్చిమ బెంగాల్‌లో చేసినట్లు ఇక్కడ చేద్దామంటే కుదరదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సౌమ్యుడిగా పేరున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వానికి.. పెట్రోలు, డీజిల్ ధరలను కట్టడి చేసే ఆలోచనే లేదన్నారు. రోజురోజుకీ పెరుగుతోన్న నిత్యావసర ధరలతో సామాన్యుడిపై పెనుభారం పడుతుందన్నారు. బియ్యం కొనుగోలులో కేంద్రం మొండి వైఖరితో ఉన్నా.. ధాన్యం కొనుగోలుకు కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇకనైనా ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు.