తెలంగాణకు గత మూడేళ్లలో 7 కొత్త జాతీయ రహదారులు ప్రకటించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతోపాటు రహదారుల నిర్మాణంలో భూ సేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు నితిన్ గడ్కరీ.
2020 జూన్ 29న 90 కిలోమీటర్ల మేరకు ఖమ్మం-దేవరపల్లి రహదారి పనులను ప్రకటించినట్లు తెలిపారు గడ్కరీ.. 2020 జూన్ 6న 85.55 కిలోమీటర్ల మేరకు కల్వకుర్తి-కొల్లాపూర్-కరివేన, 2021 మార్చి 23న 97 కిలోమీటర్ల మేరకు మెదక్-ఎల్లారెడ్డి-రుద్రూర్, 56.40 కి.మీల మేరకు బోధన్-బాసర-బైంసా రహదారులను ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇక, 2021 ఏప్రిల్ 7న 234 కి.మీల మేరకు హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు – వలిగొండ – తొర్రూర్ – మహబూబాబాద్ – ఇల్లెందు – కొత్తగూడెం, అదే విధంగా అదే రోజు 96 కి.మీల మేరకు తాండూర్-కొడంగల్-మహబూబ్ నగర్ రహదారి నిర్మాణ పనులు మంజూరైనట్లు వివరించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.