తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో భాగంగా.. ఈరోజు జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు 20,921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,37,865 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 4,16,964 మందే పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. మొత్తంగా 4.7% విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇండిర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్‌లలో ఒక్కోటి చొప్పున మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరిలోని పరీక్షా కేంద్రాలకు విచ్చేసిన అధికారులు.. ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్టు వెల్లడించారు.
కాగా.. నిన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగ్గా, 6,325 మంది గైర్హాజరయ్యారు. 517 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలు నిర్వహించగా.. 1,96,788 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,90,463 మంది విద్యార్థులే హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. పరీక్ష కేంద్రాల గుర్తింపునకు లొకేషన్ యాప్ తీసుకొచ్చినట్టు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. మరోవైపు.. నాంపల్లిలోని ఎంఏఎం జూనియర్ కళాశాలలో తాగునీటి సౌకర్యం కల్పించలేదని తేల్చడంతో.. చీఫ్ సూపరింటెండెంట్ దుర్గను, ఆ కళాశాలకు ఆకస్మికంగా సందర్శించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ సస్పెండ్ చేశారు.