Bandi Ramesh: కూకట్‌పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ హస్మత్‌పేట్‌లో పీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి ఆద్వర్యంలో మైనారిటీ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా కర్ణాటక రాష్ట రోడ్డు రవాణా శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, శివాజీ నగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ అహ్మద్, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్, కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బ్లాక్ అద్యక్షులు, డివిజన్ అద్యక్షులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బండి రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బండి రమేష్ మాట్లాడుతూ.. “ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్‌పేట్ బోయిన్ చెరువు అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదు. గత నాలుగు సంవత్సరాల నుండి ఇదిగో అదిగో అని చెప్పి ఊరిస్తూ వచ్చావు. ఇంక నువ్వు చేసేది ఎప్పుడు? ఎక్కడ నీ అభివృద్ధి?.. ఓల్డ్ బోయిన్‌పల్లిలో యాభై లక్షల రూపాయలతో మోడల్ మార్కెట్ ఇంత వరకు ఆరంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం మీ బీఆర్ఎస్ నాయకులకు ఆ మోడల్ మార్కెట్ అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారింది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. అధికార పార్టీ నాయకులు ఉన్న ప్రాంతాల్లోనీ సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రతిపక్ష నాయకులు ఉండే ప్రాంతాలలో ఉన్న రోడ్లన్నీ అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ అంజయ్య నగర్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఓటు హక్కు లేదని పాఠశాల వసతులను పట్టించుకోవా మాధవరం?ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కరెంటు,వాటర్ సప్లై లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం కూడా ఉండటంతో గర్భిణీలు చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల గోడు మీకు వినిపించదా మాధవరం?. ఓల్డ్ బోయిన్‌పల్లి చివరి బస్‌స్టాప్‌లో మౌలిక వసతులు కరువయ్యాయి బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు కనీసం కూర్చోవడానికి కూడా వసతులు లేవు. ఎండ వాన కి వేచివుండటానికి సెల్టర్ లేదు ఈ 10 సంవత్సరాలు ఏమి చేసావ్? ఓల్డ్ బోయిన్పల్లి లో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. వస్తావు ఒక శిలాఫలకం వేస్తావు వెళ్లిపోతావు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇంతేనా మాధవరం? రోడ్డు విస్తరణలో మా ఇల్లులు కోల్పోతున్న కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మా గోడు వినట్లేదు అలా అని రోడ్డు వేయట్లేదు నీకెందుకేయాలి ఓటు మాధవరం ?” అని ప్రశ్నించారు.
Also Read: Digvijay Singh: కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు..
బండి రమేష్ మాట్లాడుతూ.. “మోతీనగర్ నుంచి హైటెక్ వెళ్లే రహదారి వెడల్పు పనులంటూ మార్కింగ్ చేసి 9 ఏళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. నువ్వు ఏమ్ చేసినవ్ మాధవరం ? లక్షల జనాభా ఉన్న ప్రాంతం అయినా ప్రజా రవాణా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నామ మాత్రానికన్నా చందంగా పూటకో ఆర్టీసీ బస్సు నడుస్తుండటంతో పాలకులు పట్టించుకోవడం లేదు. చెరువుల కబ్జాలను అరికట్టడంలో కూడా ప్రభుత్వాలు ఉదాసీనత ప్రదర్శించాయి తత్ఫలితంగా మైసమ్మ చెరువు, సున్నం చెరువులో సగానికి పైగా ఆక్రమణలకు గురైంది. ఆ కబ్జాలకు కారకుడివి నువ్వు నీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? 30 కాలనీలున్న డివిజన్లలో నాలుగైదు మాత్రమే పార్కులు, పబ్లిక్ స్థలాలుండటం కచ్చితంగా సమస్యలు జాబితాలోకి రావాల్సిందే. గతంలో ఉన్న పార్కులు మింగేసావా మాధవరం? ఉద్యానవనాలంటూ విడుదలయ్యే నిధులు పూర్తిగా దారి మళ్లించి ఆ నిధులు నీ ఇంట్లోకి వచ్చేలా చేసుకున్నావ్ ఇంక నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ మాధవరం? పబ్లిక్ టాయిలెట్లంటూ క్రియాస్కుల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు పూర్తిగా గుత్తేదారుల జేబుల్లోకి వెళ్తుంటే నువ్వేం చేశావ్? అందులో నీకెంత?. రాజీవ్ గాంధీ నగర్, సప్థార్ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షాకాలం బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన దుస్థితి నెలకొంది. వరద ముంపు సమస్య స్థానికులను తీవ్రంగా వేధిస్తోంది. ఆ కాలనీలకు ఎప్పుడు అన్నా వెళ్ళవా అస్సలు?” అంటూ బండి రమేష్ ప్రశ్నలు కురిపించారు.
ప్రచారంలో దూసుకుపోతున్న బండి లకుమాదేవి
కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ సతీమణి లకుమాదేవి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆదివారం కేపీహెచ్బీ పరిధిలో పలుచోట్ల పాదయాత్రతో ఇంటింటికి ఓటు వేయాలని కోరారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల కరపత్రాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు