కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యను పరిష్కరించే వారే లేకుండా పోయారన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు దీనదయాల్ నగర్ బస్తీ వాసుల కష్టాలు వర్ణనాతీతమని వెల్లడించారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ నాలుగో ఫేస్‌లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంటికి ఓటు అడగడానికి వెళ్లినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని, హారతులు పడుతున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కాంగ్రెస్‌లో కనిపిస్తుందని, కొంతమంది మభ్యపెట్టి, భయపెట్టి, బలహీనం చేసి ఏదో సాధించాలని చూస్తున్నారని కానీ అది సాధ్యపడదన్నారు.