ఈ సువిశాల విశ్వంలో మానవుడు తెలుసుకున్నది దాదాపుగా మహాసముద్రంలో నీటి బిందువు అంతే. కానీ మానవుడి నిరంతర పరిశోధనల ద్వారా విశ్వానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఏలియన్స్ జాడతో పాటు, విశ్వంలో భూమిని పోలిన గ్రహాల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భూమిని పోలిన గ్రహాలను కనుక్కున్నారు. ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉండే వీటిని చేరాలంటే మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దాదాపుగా అసాధ్యం. నిజానికి మానవుడు ప్రయోగించిన ఏ వస్తువు కూడా ఇప్పటికీ సౌరవ్యవస్థను దాటలేదు. 1970ల్లో ప్రయోగించిన వయోజర్1,2 శాటిలైట్స్ మాత్రమే ఇప్పుడు సౌర వ్యవస్థ అంచుకు చేరాయి.
తాజాగా నాసాకు చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఈఎస్ఎస్) భూమిని పోలిన మల్టి ప్లానెట్ సిస్టమ్ ను గుర్తించింది. భూమికి దాదాపుగా 33 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహ వ్యవస్థ ఉంది. కాంతి వేగంతో అంటే సెకన్ కు 8 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అక్కడికి చేరాలంటే 33 ఏళ్లు పడుతుంది. హెచ్ డీ 2660655 అనే చిన్న, చల్లటి ఎం- మరగుజ్జు నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ రెండు గ్రహాలు భూమి పరిమాణం కలిగి ఉన్నట్లు నాసా గుర్తించింది.
అయితే ఈ గ్రహాలు మాత్రం భూమిలాగా జీవులు నివసించేందుకు అనువుగా లేవని.. వీటి కక్షలు అందుకు అనుకూలంగా లేవని నాసా వెల్లడించింది. ఈ గ్రహాలు వాటి సూర్యుడికి దగ్గర ఉండటంతో అత్యంత ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు గ్రహాల్లో ఇన్నర్ ప్లానెట్ 2.8 ఎర్త్ డేలకు ఒక సారి తన నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందని.. భూమి కన్నా 1.5 రెట్లు పరిమాణం కలిగి ఉందని, భూమికి రెండింతలు పెద్దదిగా ఉందని గుర్తించారు. మరో బయట ఉన్న గ్రహం భూమి కి 1.5 రెట్లు పెద్దగా ఉండటంతో పాటు భూమి కన్నా మూడు రెట్లు భారీగా ఉందని గుర్తించి ఇది 5.7 భూమి రోజులకు ఒకసారి దాని నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ గ్రహాలపై ఎలాంటి వాతావరణ ఉంది.. నివాసానికి యోగ్యమైన పరిస్థితులు ఉన్నాయా..? లేదా..? అనే పరిశోధనలు జరుగుతున్నాయి.