నూతనంగా ఎన్నికైన నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు తెరచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నేడు ఎత్తనున్నారు. బాబ్లీ ప్రాజెక్టును తెలంగాణ -మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కేంద్ర జల సంఘం ప్రతినిధులు సందర్శించనున్నారు.
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్‌ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్కుల మేర వరద రాగా.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్ని గేట్లను ఎత్తి ఉంచారు.