గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. నిధుల దుర్వినియోగం, పక్కదారి పట్టిన నిధుల విషయమై లెక్కలు తీస్తోన్న గృహ నిర్మాణ శాఖ అధికారులు.. వేల కోట్ల రూపాయల మేర గృహ నిర్మాణ నిధుల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటున్నారు. నిధుల దారి మళ్లింపు జరిగిందని గుర్తించారు. కేంద్ర నిధుల్లో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక నిర్దారణ అయింది. గృహ నిర్మాణం కోసం ఇచ్చిన కేంద్ర నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని పేర్కొంటున్నారు. గృహ నిర్మాణ శాఖలో సుమారు రూ. 3183 కోట్ల మేర కేంద్ర నిధుల దుర్వినియోగమైనట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు. అలాగే, పీఎంఏవై నిధులను పక్క దారి పట్టించిన జగన్ సర్కార్.. కేంద్ర స్కీంకు రూ. 1575 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల.. ఇళ్ల నిర్మాణ పథకాన్ని గందరగోళంలోకి గత సర్కార్ నెట్టేసిందని అధకారులు పేర్కొంటున్నారు. నిర్మించిన ఇళ్ల లెక్కలకి గత ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇచ్చినట్టు గుర్తించారు. 1, 32, 757 మేర ఇళ్లను నిర్మించకున్నా.. లెక్కల్లో చూపించి మభ్యపెట్టిందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అధికారులు అందించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో భూ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయి..,
అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండల పరిషత్ సమావేశ భవనంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో భూ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అనర్హులకు భూములు పంపిణీ చేశారు.. గతంలో జరిగిన భూ పంపిణీపై విచారణ జరిపి అనర్హులు దోచుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలంటూ సమీక్ష సమావేశంలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి ఫోన్ చేసి రాంప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాగా, ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పని చేసి గాలివీడు మండలాభివృద్ధికి కృషి చేయాలి.. రెవెన్యూ అధికారులు నిజాయితీగా పని చేయాలి అని కోరారు. గృహ నిర్మాణ శాఖలో కూడా అవినీతి, అక్రమాలు జరిగాయి.. త్వరలో వీటిపై కూడా విచారణ జరిపిస్తాం.. అంగన్వాడీ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదు.. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం చిన్నారులకు సక్రమంగా అందేలా చూడాలి.. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ లను ప్రారంభిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని జలాశయాలు నిండి పోయాయి..
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలా మారాయి అన్నారు. ఇక, మూడు నధుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.. సోమశిల జలాశయం ఆప్రాన్ పనులు సాగుతున్నాయి.. త్వరిత గతిన పూర్తి చేస్తామన్నారు. గత పదేళ్లుగా మేకపాటి కుటుంబం నిర్లక్ష్యం వల్ల ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదు అంటూ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి ఆరోపించారు. అలాగే, ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 12. 80 కోట్ల రూపాయలను మంజూరు చేశాం అని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమృత్-2 పథకం ద్వారా 9.4 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఆత్మకూరు పట్టణానికి ప్రతి రోజు తాగు నీటిని అందిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఆత్మకూరులో బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైంది.. ఆత్మకూర్ ప్రజలకు సేవ చేసేందుకు తాను నిరంతరం కృషి చేస్తాను.. ఆత్మకూరుకు పూర్వ వైభవాన్ని తీసుకు వస్తాం అని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఆల్ ది బెస్ట్ అంటూ కేటీఆర్ తన ట్వీట్..
తెలంగాణకు మరిన్ని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాలకు వెళ్లింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు నా శుభాకాంక్షలు.. ఆల్ ది బెస్ట్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి విదేశాల్లోని ప్రముఖ కంపెనీలతో వారు పెంచుకున్న సంబంధాలు ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేస్తున్నాయి. అలుపన్నది లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చాం. వాటిని చూస్తుంటే నేడు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడం సంతోషకరమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రాధాన్యం ఇచ్చాం అని కేటీఆర్ అన్నారు. టీఎస్-ఐపాస్‌లో ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలకు ఆకర్షితులై అనేక కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. గత దశాబ్దంలో ప్రయివేటు రంగంలో రూ.4 లక్షల కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాం. రాజకీయాలు పక్కన పెడితే నాకు, బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణే ముందు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి, తాము ఏర్పాటు చేసిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విజయం సాధిస్తుందని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.. జై తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని.. ప్రోత్సహించే వారిని ఉపేక్షించం..
పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించడము ద్వారా.. పరోక్షముగా స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సీపీ సుధీర్ బాబు మూసివేతకు ఆదేశించారు. SHO వనస్థలిపురం విజ్ఞప్తి మేరకు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ రూమ్‌ల ప్రాంగణాన్ని మూసివేశారు. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిని.. అసాంఘీక కార్యకలాపాలు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలని కొనసాగించే వారిని.. హోటళ్లు, బార్ & రెస్టారెంట్లు మరియు ఇతరత్ర ప్రాంగణాలలో అసాంఘీక కార్యకలాపాలను ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం?.. కేంద్రంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వార్తలొస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ సమచారం మేరకు.. శుక్రవారమే కేబినెట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా.. త్వరలోనే పార్లమెంటులో అందుకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ చట్టం (1954)లో 40కి పైగా సవరణలను తాజా గా కేంద్ర ప్రభుత్వం చేర్చబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాలు భూమి ఉంది. ఆస్తులపై వక్ఫ్ బోర్డు అధికారాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురానున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ఆధిపత్యానికి, అధికారాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. వక్ఫ్ బోర్డు మీడియాకు స్వయంప్రతిపత్తిని హరించేందుకు మోడీ యత్నిస్తున్నారు. ఈ ప్రతిపాదిత సవరణ గురించి మీడియాలో రాసేలా చేస్తున్నారు. వక్ఫ్ ఆస్తులకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకం. వారికి హిందూత్వ ఎజెండా ఉంది. వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తి కోల్పోవడంతో దానిపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుంది. వక్ఫ్ స్వాతంత్ర్యం దెబ్బతింటుంది. అప్పుడు కేంద్రం ఈ ఆస్తి వివాదాస్పదమని, దానిని సర్వే చేయిస్తామని తెలుపుతుంది. ఆ సర్వే బీజేపీ, సీఎంలు చేయిస్తారంటే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలిసిందే. మన భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు చెందిన చాలా దర్గాలు ఉన్నాయి, అవి దర్గాలు, మసీదులు కాదని బీజేపీ-ఆర్ఎస్ఎస్ వాదించాయి. ఇప్పుడు వారి చేతికి బోర్డు చిక్కితే నాశనం చేస్తారు.” అని పేర్కొన్నారు.
“ఆమె రాజీనామా చేయాలి”.. బంగ్లా నిరసనల్లో 21 మంది మృతి.. భారత్ కీలక సూచనలు..
బంగ్లాదేశ్ మరోసారి నిరసనలతో అట్టుడుకుతోంది. ఇటీవల రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా బంగ్లా వ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆందోళన చేయడం హింసాత్మకంగా మారింది. అయితే, అక్కడి సుప్రీంకోర్టు ఈ నిర్ణయంపై స్టే విధించడంతో ఆందోళనలు తగ్గాయి. అయితే, నిరసనలను పోలీసులతో ఘోరంగా అణిచివేయడంపై మరోసారి ఆ దేశంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం రాజధాని ఢాకాలోని సెంట్రల్ ఢాకా స్వ్కేర్‌లో భారీ నిరసన నిర్వహించారు. నిరసనలకు బంగ్లాదేశ్ కీలక నాయకుల్లో ఒకరైన ఆసిఫ్ మహమూద్ పోరాటానికి సిద్ధంగా ఉండాలని తన మద్దతుదారుల్ని కోరాడు. కొంతమంది మాజీ సైనికాధికారులు కూడా విద్యార్థి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం భుయాన్ మద్దతుగా తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని ఎరుపుగా మార్చారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ శనివారం ఢాకాలో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ సైన్యం ప్రజల విశ్వాసానికి చిహ్నం అని చెప్పారు. ఇది ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మరియు ప్రజల కోసం మరియు దేశానినికి ఏ అవసరం వచ్చినా అది చేస్తుందని శనివారం సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది.
సెమీస్లోకి భారత హాకీ జట్టు.. పెనాల్టీ గోల్లో విజయం
పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వార్టర్స్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. బ్రిటన్తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో మొదట ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత షూటౌట్ జరిగింది. అందులో బ్రిటన్ జట్టు కొట్టే గోల్స్ను అడ్డుకోవడంలో కాస్త తడబడిన భారత్ ఆటగాళ్లు అందుకు ధీటుగా గోల్స్ చేశారు. షూటౌట్ 4-2 తేడాతో భారత్ విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. దీంతో.. షూటౌట్‌లో బ్రిటన్‌ను ఓడించి భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 మంది ఆటగాళ్లతో ఆడింది. ఎందుకంటే రెండో క్వార్టర్‌లో అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ ఇచ్చారు. దాని కారణంగా అతను మొత్తం మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయినా పట్టు వదలని భారత జట్టు చివరి వరకు బ్రిటన్‌కు గట్టిపోటీనిచ్చింది. ఈ విధంగా భారత జట్టు పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది. సెమీఫైనల్‌లో విజయం సాధిస్తే భారత్‌కు కనీసం రజత పతకం ఖాయం. ఆగస్టు 6వ తేదీ మంగళవారం భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.