తొందరలోనే కొత్త రేషన్ కార్డులని అందిస్తాం..
తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ప్రజలకు కరెంటు ఇవ్వాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ట్రిప్ అయితే కరెంటు ఇచ్చేవాళ్ళు కాదు.. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి కంప్లైంట్ వస్తే అర్ధరాత్రి కూడా వెళ్లి కరెంటు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం.. క్షేత్రస్థాయిలో కరెంటు సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు.. రాజకీయ లబ్ది కోసం కొంత మంది సిబ్బందిపై దృష్ప ప్రచారం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు పోవటం అనేది లేనేలేదు.. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు తప్ప.. లైన్ మెయింటెనెన్స్ సమయంలో కరెంటు తీసి చెట్లని కొట్టడం జరుగుతుంది అన్నారు. చెట్ల కొమ్మలు కరెంటు వైర్ల మీద పడినప్పుడు మాత్రమే కరెంటు పోతుంది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంగా కరెంటు పోతే కూడా కరెంటు పోతుందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 24 గంటలు రాష్ట్రంలో కరెంటు ఇస్తున్నాం.. కరెంటు వాడకం పెరిగినప్పటికీ కరెంటును తెప్పించి ప్రజలకు ఇస్తున్నాం.. రాబోయే 10 ఏళ్లకు కూడా అవసరమయ్యే కరెంటుని ఉత్పత్తి చేస్తున్నాం.. పొల్యూషన్ లేని విద్యుత్ ఉత్పాదనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ఎప్పుడూ కరెంటు కోత ఉండదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే, కొత్తగా రేషన్ కార్డులని అందిస్తామన్నారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తాం.. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది.. లక్ష్యానికి అనుగుణంగా అందరికీ రుణమాఫీ చేస్తున్నాం.. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కూడా జరుగుతుంది అని భట్టి విక్రమార్క వెల్లడించారు.
కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నాం..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ధరణి అన్న సంగతి ఈరోజుకి కూడా వాళ్ళు తెలుసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మా ప్రభుత్వం రాగానే ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతూమని ఆనాడే చెప్పామన్నారు. నిన్న అసెంబ్లీలో ఈనాటి ప్రతి పక్షమైన బీఆర్ఎస్ నాయకులు మా ధరణి వల్ల కోటి మంది ఆనందంగా ఉన్నారని వారి సొంత డబ్బా కొట్టుకున్నారు అంటూ మండిపడ్డారు. దేశంలో ఉన్న 18 రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిలో ఉన్న మంచిని తీసుకొని ఒక కొత్త చట్టాన్ని తీసుకు రాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆనాటి ప్రభుత్వం లాగా కాకుండా ప్రజా అభిప్రాయాలతో మంచి చట్టాన్ని తీసుకురాబోతున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆ చట్టం యొక్క వివరాలు పబ్లిక్ డోన్ లో పొందుపరచడం జరుగుతుంది.. కౌవులు, కళాకారులు గ్రామాల్లో ఉన్న రైతులు ప్రతి ఒక్కరి సూచనల మేరకు మంచిని తీసుకొని మంచి రెవెన్యూ చట్టాన్ని తయారు చేయబోతున్నామన్నారు. రైతాంగం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరగకుండా ఈ పేదోడి ప్రభుత్వం రైతన్నలకి మంచి చట్టాన్ని ప్రవేశ పెడుతుంది.. నా సొంత నియోజకవర్గమైన పాలేరు పాత కాలువకి నీటిని విడుదల చేయడం జరిగింది అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
డ్రగ్స్‌పై తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం..
డ్రగ్స్‌పై తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపింది. డ్రగ్స్ ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు డ్రగ్స్ మాట వినపడద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు వెనుకాడ వద్దని అధికారులకు ప్రభుత్వం కరాకండిగా చెప్పింది. అంతేకాకుండా స్కూల్ స్థాయి వరకు చేరిపోయిన డ్రగ్స్ ని నియంత్రణ చేయకపోతే భవిష్యత్తు తరాలు పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేసింది. దీనికి డీజీ స్థాయి అధికారులు నియమించింది. పెద్ద ఎత్తున నిధులతో పాటు సిబ్బందిని కేటాయించింది. మరోవైపు డ్రగ్స్ కిట్లను కూడా ఏర్పాటు చేసింది. అప్పటికప్పుడు పరీక్షలు చేసి నివేదికరించే ఇచ్చి డ్రగ్స్ కిట్లను కూడా నార్కోటికి బ్యూరో అందించింది. మరోవైపు నర్కోటి బ్యూరోకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతోపాటు డ్రగ్స్ అమ్మకం కొనుగోలు దారులపై నిగా పెట్టేందుకు అవసరమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. గత ఆరునెల కాలంలో ఊహించినీ రీతి లో నార్కోటికి బ్యూరో ఫలితాలు అందించింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న గంజాయిని కూడా కట్టడి చేసేందుకు ఈ బ్యూరో సఫలీకృతమైంది. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి హైదరాబాద్కు చేరుకుంటుంది . కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. గంజాయికి హైదరాబాద్ ట్రాన్సిట్ పాయింట్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. గత ఆరు నెలల కాలంలో నార్కోటిక్ బ్యూరో విపరీతమైన ఫలితాలను సాధించింది అంతేకాదు హైదరాబాద్ కి డ్రగ్ పెడ్లర్స్ రావాలంటే భయపడే స్థాయికి ఎదిగిపోయింది. దీంతోపాటు బ్యూరోకి పెద్ద మొత్తంలో సమాచారం వస్తుంది నిఘా వ్యవస్థని ప్రతిష్ట చేయడంతో ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ నుంచి సమాచారం ఈజీగా అందుతుంది.
నంద్యాల ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. బాలిక సంక్షరక్షణ బాధ్యత నాదేనన్న చంద్రబాబు..
నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం విషాదంగా మారింది.. అయితే, ఆ కుటుంబంలోని ఓ చిన్నారి హాస్టల్ ఉండి చదువుకోవడంతో.. ప్రాణాలు బయటపడినట్టు అయ్యింది.. ఇక, మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటనపై చలించిపోయారు సీఎం చంద్రబాబు.. నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్థరాత్రి మట్టి మిద్దె కూలడంతో వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఈ ఘటనలో గురుశేఖర్ తో పాటు భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. అయితే, రెండో కుమార్తె తల్లపురెడ్డి గురు ప్రసన్న(15) ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుకుంటోంది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులతో సహా తోబుట్టువులు చనిపోవడంతో ప్రసన్న అనాథ అయ్యింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ప్రసన్నకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరుపున రూ.10 లక్షల సాయం ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ తల్లపురెడ్డి నాగమ్మ(70) సంరక్షణలో ఉందని అధికారులు వివరించారు. ప్రసన్న పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేయడంతో పాటు.. వృద్ధురాలైన నాగమ్మకు రూ.2 లక్ష సాయం అందించాలని అధికారులను అదేశించారు సీఎం చంద్రబాబు.. జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ధైర్యం చెప్పాలని సూచించారు. చిన్న వయసులో తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన ఆ బాలికకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా నిలుస్తామని అన్నారు సీఎం చంద్రబాబు.. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన.. ఆ చట్టం రద్దు..
అప్కాబ్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.. గత ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేయనున్నాం.. త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.. చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి అనేది తమ ప్రభుత్వ ఉద్దశ్యంగా స్పష్టం చేశారు.. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్పించి రుణాలు వచ్చేలా చేస్తాం అన్నారు.. అయితే, ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నారు.. సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన.. టీడీపీ హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని సూచించారు.. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలన్నారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.. ఇక, రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలన్నారు.. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.. డిజిటైలేజేషన్‌తోనే అక్రమాలకు చెక్ చెప్పగలం. సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.. ఈరోజు ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాను. APCOB సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని.. ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాల్లో జవాబుదారీతనం, పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని.. సహకార వ్యవస్థలో EKYC అమలు చేయడంతో పాటు ఈ – ఆఫీస్ విధానంలో కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ప్రతి కౌలు రైతుకూ న్యాయం జరగాలి. సాగు చేసే రైతుకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్న ఆయన.. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నా హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పునకు కృషి చేస్తాను.. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు ఇచ్చేందుకు ఆదేశించాను. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.
ధైర్యానికి పేరు.. అన్నిటినీ దాటుకుని అమాయక గిరిజనులను కాపాడిన సైనికులు
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఎంతటి నష్టం జరిగిందో తెలిసిందే. గిరిజన సామాజిక వర్గానికి చెందిన నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు 8 గంటలపాటు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. అడవిలో చిక్కుకున్న నలుగురు చిన్నారులతో సహా గిరిజన కుటుంబాన్ని అటవీశాఖ అధికారులు రక్షించారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతం కావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. వాస్తవానికి, ఈ వారం ప్రారంభంలో వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 344 మందికి పైగా మరణించారు. 206 మంది జాడ ఇంకా తెలియరాలేదు. మరణించిన వారిలో దాదాపు 30మంది పిల్లలు ఉన్నారు. కలపేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కె. హషీస్ నాయకత్వంలో నలుగురు బృందం గురువారం (ఆగస్టు 1) ఒక గిరిజన కుటుంబాన్ని రక్షించడానికి అడవిలోని ప్రమాదకరమైన మార్గాల్లో ట్రెక్కింగ్ ద్వారా బయలుదేరింది. వాయనాడ్‌లోని పానియా వర్గానికి చెందిన ఈ కుటుంబం కొండపై ఉన్న ఒక గుహలో చిక్కుకుంది. దాని ప్రక్కనే లోతైన లోయ ఉంది. ఆ కుటుంబంలో ఒకటి నుంచి నాలుగేళ్ల మధ్య వయస్సు గల నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ బృందం గుహకు చేరుకోవడానికి నాలుగున్నర గంటలకు పైగా సమయం పట్టింది. అటవీ అధికారి కె. వాయనాడ్‌లోని పానియా సామాజికవర్గానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన ఒక మహిళ, నాలుగేళ్ల చిన్నారిని దట్టమైన అటవీ ప్రాంతం సమీపంలో కనిపించిందని హాషిస్ చెప్పారు. విచారించగా ముగ్గురు పిల్లలు, ఆమె భర్త గుహలో చిక్కుకున్నట్లు తేలింది. ఆ ప్రజలకు తినడానికి, త్రాగడానికి ఏమీ లభించడం లేదు. పానియా కమ్యూనిటీకి చెందిన ఈ కుటుంబం గిరిజన సమాజంలోని ప్రత్యేక విభాగం నుండి వచ్చిందని, వారు సాధారణంగా బయటి వ్యక్తులతో కలవడానికి ఇష్టపడరని హాషిస్ చెప్పారు. వారు సాధారణంగా అడవిలో లభించే ఆహారంపై ఆధారపడతారని ఆయన తెలిపారు. దీంతో పాటు ఆ సరుకులను స్థానిక మార్కెట్‌లో విక్రయించి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కానీ వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా వారికి తినడానికి ఏమీ లభించకుండా పోయింది.
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో యామినీ కృష్ణమూర్తి జన్మించారు. పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులు అందుకున్నారు. యామినీ కృష్ణమూర్తి 1957లో మద్రాస్‌లో రంగప్రవేశం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్థాన నర్తకి అనే గౌరవం ఉంది. ఆమె కూచిపూడి నృత్య రూపానికి టార్చ బేరర్ అని కూడా పిలుస్తారు. ఇక ఢిల్లీలోని హౌజ్‌ఖాస్‌లోని యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌లో యువ నృత్యకారులకు పాఠాలు నేర్పారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ సంతాపం తెలిపారు. ‘భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ఎనలేని ప్రతిభ చూపి, అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖ నృత్య కళాకారిణి పద్మ విభూషణ్ డాక్టర్ యామినీ కృష్ణమూర్తి మరణం పట్ల వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో తనదైన శైలితో అద్భుత ప్రతిభ చూపిన యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యంలో చెరగని ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. యామినీ కృష్ణమూర్తి మరణం శాస్త్రీయ నృత్య రంగంలో తీరని లోటని, ఆమె తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. యామినీ కృష్ణమూర్తి ఆత్మకు శాంతి కలగాలని జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
50రోజులు పూర్తి చేసుకున్న మహారాజ..విజయ్ సేతుపతికి ఎన్నికోట్లు లాభం అంటే…?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ చిత్రం మహరాజ. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. కాగా ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకొమని కొరక అందుకు అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించాడు సేతుపతి. విడుదల నాటి నుండి సూపర్ హిట్ తో దూసుకు వెళ్ళింది మహారాజ. జూన్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటికీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో ఓటీటీల హావ సాగుతుండగా కేవలం ఒకటి లేదా రెండు వారాలలోనే థియేటర్ల రన్ ముగిస్తుంటే మహారాజ అనుదుకు బిన్నంగా ఓటీటీలో విడుదలై కూడా థియేటర్లలో అర్ధశతదినోత్సవం ప్రదర్శింపబడి ఔరా అనిపించింది. ఇటు తెలుగులోను మహారాజ సూపర్ హిట్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహారాజా 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలను వేధించే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించి నిర్మాత మంచి కోరి, రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా మహారాజా అనిపించుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.