ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాల వేగంగా మారుతున్నాయి. పార్టీలో టికెట్ లభించకపోయినా, సమచిత స్థానం కల్పించలేకపోయినా లీడర్లు పార్టీ మారుస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేసింది. ఈ క్రమంలో పార్టీ నుంచి అలకలు, బుజ్జగింపుల పర్వం మొదలైంది.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. 'సిద్ధం' పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు.
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. "నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా ?. నీ లాగా మామకు వెన్నుపోటు పొడిచానా ?. చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీరు ఇస్తున్నాం... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశావ్. రాజకీయంగా చూసుకోలేక చౌకబారు విమర్శలకు దిగారు. ఓటమి భయంతో చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారు." అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ యాప్స్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాలుగు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్‌ను మంత్రి ఆవిష్కరించారు.
హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని.. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని వెల్లడించారు.