Minister Peddireddy: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది.. కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు మోస్తున్నారు.. ఆ నలుగురికి ఇంకెవరైనా తోడు ఉంటే ఉట్టి పట్టుకునేందుకు ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారని గుర్తుచేసిన ఆయన.. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంతవరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణం అని ఆరోపణలు గుప్పించారు. అసలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా చంద్రబాబే మూల కారణంగా పేర్కొన్నారు.. వైఎస్ జగన్‌ను అక్రమంగా జైలులో పెట్టడానికి, రాష్ట్రం విడిపోవడానికి కూడా చంద్రబాబే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.