దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల లిస్టు విడుదల చేసింది.
హైదరాబాద్ లో 4 గంటలపాటు వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో నగరవాసులను వణికించింది. అంతేకాకుండా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లంగర్ హౌస్ కుతుబ్ షాహీ మజీద్ పై పిడుగుపడింది. దీంతో మజీద్ పైన ఉన్న కలుషం కింద పడిపోయింది. అంతేకాకుండా మజీద్ గోడ పగుళ్లు వచ్చాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. దీంతో ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో.. బిల్డింగ్ పాతది కావడంతో కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు ముంబైలో రెండు రోజుల పాటు(శుక్ర, శని) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావారణ శాఖ.