చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ కదలికలన్నింటినీ ధ్రువీకరించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 రోవర్ 'ప్రజ్ఞాన్' ఎనిమిది మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించిందని, దాని పేలోడ్‌లను ఆన్ చేసినట్లు ఇస్రో శుక్రవారం వెల్లడించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. బుధవారం అంటే ఆగస్టు 23 భారతదేశానికి, ప్రపంచానికి చారిత్రాత్మకమైన రోజు. ల్యాండ్ అయిన రెండు గంటల 26 నిమిషాల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండర్ 'విక్రమ్' నుంచి బయటకు వచ్చింది.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి.